వారంతా దోపిడీ దారులు.. జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కూట‌మి ప్ర‌భుత్వంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వారంతా దోపిడీ దారులు.. అని ప్ర‌క‌టించారు. గ‌నులు, వ‌న‌రులు.. ఇసుక‌, మ‌ద్యం, చివ‌ర‌కు.. పేద‌లు తినే బియ్యాన్ని కూడా దోచుకుంటున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి(గ‌తంలో వైసీపీ నాయ‌కుడు)పై జ‌గ‌న్ మ‌రిన్ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. స్థానికంగా గ‌నులను ఆయ‌న సీజ్ చేసేశార‌ని.. తాను చెప్పిన వారికి మాత్ర‌మే లీజులు ఇస్తున్నార‌ని చెప్పారు.

ఇలా లీజులు తీసుకున్న‌వారి నుంచి రోజువారీ వ‌సూళ్లు చేస్తున్నార‌ని లెక్క‌ల‌తో స‌హా వివ‌రించారు. ఈ సొమ్ములో కొంత వీపీఆర్ ఉంచుకుని.. మ‌రికొంత సొమ్మును చిన్న‌బాబు నారా లోకేష్‌కు, చంద్ర‌బాబుకు పంపిస్తున్నార‌ని ఆరోపించారు. ఇక‌, జిల్లాల్లో ఎక్క‌డ చూసినా.. పేకాట క్ల‌బ్బులు అధికారికంగా ఎమ్మెల్యేలు నిర్వ‌హిస్తున్నారని.. దీనిలోనూ వాటాలు పైవాళ్ల‌కు వెళ్తున్నాయ‌ని చెప్పారు. మ‌ద్యం సిండికేట్లు ప్ర‌జ‌ల‌ను దోచేస్తున్నార‌ని.. అన‌ధికార ప‌ర్మిట్ రూమ్‌ల‌లో ఎంఆర్‌పీ క‌న్నా ఎక్కువ‌కు మ‌ద్యాన్ని విక్ర‌యించి వాటాలు పంచుకుంటున్న‌ట్టు చెప్పారు.

ఇది చాల‌ద‌న్న‌ట్టుగా.. బెల్టు షాపులు నిర్వ‌హిస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. “వీధికో బెల్ట్ షాపు పాత మాట‌. ఇప్పుడు ఇంటింటికో బెల్టు షాపు న‌డుస్తావుంది. వీటిని నిర్వ‌హించేది ఎవ‌ర‌య్యా అంటే.. టీడీపీ ఎమ్మెల్యేలే. వారికి మామూళ్లు మోస్తోంది ఎవ‌ర‌య్యా అంటే.. డీఎస్పీలు, సీఐలే. వారంతా దోచుకుని.. దౌర్జన్యంగా సొమ్ములు రాబ‌ట్టి.. ప్ర‌జ‌ల నుంచి సేక‌రించి.. తాము కొంత ఉంచుకుని.. మిగిలిన దానిలో పెద్ద‌బా బు, చిన్నబాబుల‌కు వాటాలు పంచుతున్నారు. ఇదీ.. రాష్ట్రంలో చంద్ర‌బాబు పాల‌న‌“ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారు!

ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. సూప‌ర్ 6, సూప‌ర్ 7 వంటివి ఏనాడో పోయాయ‌ని చెప్పారు. ప్ర‌జ‌లు వాటి కోసం ఎదురు చూస్తున్నార‌ని.. కానీ.. వాటి విష‌యంలో మాయ చేస్తున్నార‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మోసం చేశార‌ని అన్నారు. ఈ విష‌యాల‌పై తాము ప్ర‌శ్నిస్తున్నందుకే.. వైసీపీ నేత‌ల గొంతు నొక్కి.. కేసులు పెడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు ఆట‌లు ఎన్నాళ్లో సాగ‌బోవ‌మ‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. త్వ‌ర‌లోనే త‌మ ప్ర‌భుత్వం వ‌స్తుంద‌న్నారు.