సీనియర్ నాయకుడు, బీఆర్ ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అని వార్యంగా మారిన ఉప ఎన్నికకు సంబంధించి.. కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఉప ఎన్నికకు మరో మూడు మాసాల వరకు సమయం ఉంది. అయితే.. అభ్యర్థిని ఖరారు చేస్తే.. ఇప్పటి నుంచే ప్రచారం చేసుకుని.. గెలుపు గుర్రం ఎక్కే అవకాశం కోసం.. నాయకులు ఎదురు చూస్తున్నారు. ఇక, ఈ సీటు నుంచి గత 2023 ఎన్నికల్లో పరాజయం పాలైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్.. మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో పార్టీ అధిష్టానంతో సంబంధం లేదన్నట్టుగా.. ఆయన కొన్నాళ్ల కిందటే.. తానే జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని.. గెలిచి తీరుతానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత.. జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా.. ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని.. ఎవరికి వారు ఇలా ప్రకటించుకుంటే ఎలా? అంటూ సీరియస్ అయ్యారు. దీంతో నాయకులు వెనక్కి తగ్గారు. కానీ, ప్రయత్నాలు మాత్రం ఎవరూ ఆపలేదు.
ఈ క్రమంలో తాజాగా పార్టీలో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. పోటీలో ఎంతో మంది ఉన్నప్పటికీ.. మైనారిటీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్న డిమాండ్ పెరుగుతున్న క్రమంలో అజారుద్దీన్‌కే ఈ టికెట్ ఇవ్వాలని స్థానిక నాయకత్వం దాదాపు డిసైడ్ అయినట్టు తెలిసింది. మైనారిటీ వర్గానికి మంత్రివర్గంలోనూ ప్రాధాన్యం దక్కకపోయిన నేపథ్యంలో ఆ వర్గం నేతలు.. తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను కలుసుకుని ఈ మేరకు విన్నవించారు.
మైనారిటీ వర్గం ఆది నుంచి కాంగ్రెస్‌కు అండగా ఉందని.. ఈ క్రమంలో ఆవర్గానికి ఉప ఎన్నిక టికెట్ దక్కేలా చూడాలని కోరారు. దీనికి గౌడ్ దాదాపు పచ్చజెండా ఊపినట్టు పార్టీ వర్గాల మధ్య చర్చ సాగుతోంది. అయితే.. ఇంకా సమయం ఉన్న క్రమంలో దీనిపై అధిష్టానం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోయిన నేపథ్యంలో అజార్‌కు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం కూడా సుముఖంగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates