తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం, ఒకప్పటి అధికార పార్టీ బీఆర్ ఎస్ చుట్టూ.. గొర్రెల కుంభకోణం చుట్టు కుంటోంది. గొర్రెల పేరుతో రూ.700 కోట్ల రూపాయల మేరకు కుంభకోణం జరిగినట్టు.. ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అంతేకాదు.. దీనికి మించిన సొమ్ము అక్రమ దారుల్లో `పెద్దలకు` చేరిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మనీలాండరింగ్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.
తాజాగా ఈడీ అధికారులు ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. బీఆర్ ఎస్ హయాంలో యానిమల్ హజ్బెండరీ విభాగం డైరెక్టర్‌గా పనిచేసిన రామచందర్ నాయక్, అదేవిధంగా ఈ కేసులో కీలక నిందితుడు మొయినుద్దీన్ సహా.. పలువురి ఇళ్లు.. వారి బంధువుల నివాసాల్లోనూ బుధవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఏసీబీ గుర్తించింది 700 కోట్ల కుంభకోణమే అయినా.. దీని వెనుక.. చాలానే ఉందని భావిస్తున్నారు.
బీఆర్ ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్.. 2015 ప్రారంభంలోనే గోర్రెల పంపిణీ పథకాన్ని ప్రకటించి అమలు చేశారు. సుమారు 4 వేల కోట్లను ఈ పథకానికి కేటాయించారు. ఖర్చు కూడా చూపించారు. అయితే.. ఆ మేరకు.. గొర్రెలు.. లబ్ధిదారులకు చేరలేదు. పైగా ఏపీ, బీహార్, యూపీ వంటి రాష్ట్రాల నుంచి తక్కువ ధరలకు గొర్రెలు తీసుకువచ్చి.. వాటిని ఎక్కువ మొత్తంలో బిల్లులు చేసుకున్నారని.. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శించారు. ఇది రాజకీయ దుమారంగా కూడా మారింది.
అయితే.. అప్పట్లో కేసీఆర్ ఈ విమర్శలను తోసిపుచ్చారు. పశువుల కాపరులు బాగుపడితే కూడా.. కాంగ్రెస్ నాయకులు చూడలేక పోతున్నారని దుయ్యబట్టారు. అయితే ఈ స్కీంలో ఆది నుంచి అధికారులు, దళారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వున్నాయి. అంతేకాదు.. అధికార పార్టీ నాయకులు కూడా చేతులు కలిపారన్నది అప్పట్లో వెలుగు చూశాయి. గొర్రెల పేరుతో బొక్కిన నిధులను బినామీ ఖాతాల్లోకి మళ్లించి ఆ తర్వాత.. వివిధ మార్గాల్లో అందరూ పంచుకున్నారని ఏసీబీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మనీ లాండరింగ్ నిగ్గు తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates