మీ ప‌నితీరు అద్భుతం: బాబుకు సింగ‌పూర్ మంత్రి ప్ర‌శంస‌లు

సింగ‌పూర్‌లో ప‌ర్య‌టిస్తున్న సీఎం చంద్ర‌బాబుకు.. అక్క‌డి పారిశ్రామిక‌వేత్త‌ల నుంచి ఆ దేశ మంత్రుల నుంచి కూడా ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. “మీ నైపుణ్యాలు మాకు అవ‌స‌రం. మీరు చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నారు“ అని చంద్ర‌బాబు వ్యాఖ్యానిస్తే.. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్‌ సీ లాంగ్ మాత్రం.. “మీ ప‌నితీరు అద్భుతం. మీ నుంచి ప‌నితీరును నేర్చుకోవాలి.“ అని ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి టీజీ భ‌ర‌త్‌.. సీఎం చంద్ర‌బాబు రోజుకు 18-20 గంట‌ల పాటు.. రాష్ట్రం కోసం ప‌నిచేస్తున్నార‌ని వివ‌రించారు.

తాజాగా సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు.. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్‌ సీ లాంగ్‌తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేలా పారిశ్రామిక వేత్త‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని కోరారు. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్‌గా ఏపీ రూపాంతరం చెందుతోంద‌ని.. ఈ రంగంలో పెట్టుబ‌డులు పెట్టాల‌నిసూచించారు. దీనికి మంత్రి ఓకే చెబుతూ… “మీరు నిరంత‌రం.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తున్నారు. ఇదెలా సాధ్య‌మ‌వుతోంది ?“ అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డం నుంచి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు తీసుకుంటున్న శ్ర‌ద్ధ‌ను ఆయ‌న ప్ర‌శంసించారు.

ఈ సంద‌ర్భంగా ఇరువురు నాయ‌కుల‌కు మ‌ధ్య గృహ నిర్మాణం, స‌ముద్రంలో కేబుల్ నిర్మాణం వంటి కీల‌క ప్రాజెక్టుల‌పై ఒప్పందాలు కుదిరాయి. ఏపీకి వ‌చ్చేందుకు చంద్ర‌బాబుతో క‌లిసి ప‌నిచేసేందుకు తాము సుముఖంగా ఉన్నామ‌ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్‌ సీ లాంగ్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఇరువురు నేత‌లు.. గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు. హైద‌రాబాద్‌లో చేప‌ట్టిన ప్రాజెక్టులు ఇప్ప‌టికీ అంతే నాణ్య‌త‌తో కొన‌సాగుతున్నాయ‌ని చంద్ర‌బాబు చెప్ప‌గా.. అదంతా మీ విజ‌న్ తోనే సాకారం అయింద‌ని.. మంత్రి లాంగ్‌ చెప్పారు.