వైసీపీ అధినేత జగన్.. కార్యకర్తల సెంట్రిక్‌గా రాజకీయాలను ముమ్మరం చేస్తున్నారు. గత 2014, 2019 ఎన్నికల సమయంలో తానే అన్నీ అయి రాజకీయాలు చేసుకున్నారు. తన కుటుంబం కూడా వెంట నడిచింది. అమ్మ, చెల్లి.. ఇద్దరూ కూడా రాజకీయాలకు దోహదపడ్డారు. అయితే.. ఇప్పుడు వారిద్దరూ కూడా దూరమయ్యారు. పైగా చెల్లి రాజకీయాలు యాంటీగా మారాయి. దీంతో జగన్‌కు ఇప్పుడు ఆదరువుగా ఉన్న కుటుంబ సభ్యులు, నాయకులు కూడా ఎవరూ కనిపించడం లేదు.
దీంతో ఇప్పుడు కార్యకర్తలనే ముందు పెట్టి రాజకీయాలు చేయాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతు న్నారు. అంటే.. గతంలో సీఎం అయ్యేందుకు తాను కష్టపడిన విషయం తెలిసిందే. పాదయాత్రలు.. సెంటిమెంటును కలిపి ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఇప్పుడు కార్యకర్తల చేత, కార్యకర్తల వలన.. అన్నట్టుగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఉదాహరణకు నాయకుల కంటే కూడా.. కార్యకర్తలకు ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది.
క్షేత్రస్థాయిలో ప్రస్తుతం వైసీపీకి నాయకుల కొరత వెంటాడుతోంది. కేసుల భయం కావొచ్చు.. లేదా.. రాజకీయంగా వారికి ఎదరయ్యే కష్టనష్టాల వల్ల కావొచ్చు.. కీలక నాయకులు మౌనంగానే ఉంటున్నారు. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. మరో నాలుగేళ్లలో పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని గమనిస్తున్న జగన్.. కార్యకర్తలకే అన్నీ అప్పగించి.. వారిలోనే వేడి రగిలించాలని.. తద్వారా.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను వారే నిర్వహించేలా చేయాలన్న విధంగా కార్యాచరణకు ప్రాణం పోస్తున్నారు.
అంతేకాదు.. వైసీపీని వీడిన వారిని కూడా తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే.. వైసీపీలో కీలక పాత్ర పోషించి.. తర్వాత.. ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేనలో కి వెళ్లిన వారిని తిరిగి అవకాశం ఉంటే.. వస్తానంటే.. వారికి కండువా కప్పాలని నిర్ణయించారు. దీంతో ఆయా పార్టీలకు షాక్ ఇవ్వాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తంగా అటు కార్యకర్తలపైనే ఎక్కువగా ఆధారపడుతూ.. ఇటు పార్టీని వీడిన వారిని కూడా వెనక్కి రప్పించే దిశగా జగన్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates