తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు, బీజేపీ ఏపీ నేత, ఎంపీ సీఎం రమేష్‌కు మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తెలంగాణ కాంట్రాక్టులను ఏపీ వారు దోచుకుంటున్నారని.. ఇందుకేనా తెలంగాణ సాధించింది.. అని కేటీఆర్ విమర్శించారు. దీనిలో సీఎం రేవంత్ పేరును కూడా తీసుకువచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టి 10 వేల కోట్లు దోచుకున్నారని.. దీనికి ప్రతిఫలంగానే ఫ్యూచర్ సిటీలో రోడ్ల కాంట్రాక్టు సీఎంరమేష్‌కు చెందిన కంపెనీకి ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు.
దీనిపై చర్చకు కూడా సిద్ధమేనని కేటీఆర్ ప్రకటించి.. సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాలన్నారు. ఈ నేపథ్యానికి తోడు.. బీజేపీ ఎంపీ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చర్చకు సిద్ధం కావాలన్నారు. ఈ పరిణామాలు చూస్తే.. రాను రాను మరింత వేడెక్కుతున్నాయి. దీంతో ఈవ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించే విషయం.. ఆసక్తిగా మారింది. రాజకీయంగా దీనిని హైలెట్ చేయాలని.. ప్రజల్లోకి కూడా తీసు కువెళ్తానని కేటీఆర్ చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొమ్ములు నొక్కేశారని కూడా వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు? అనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం రేవంత్ రెడ్డి మౌనంగానే ఉన్నారు. కానీ, ఇది కీలక ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారం కావడం.. రూ.10 వేల కోట్ల మేరకు కుంభకోణం జరిగిందని.. ఆరోపణలు రావడం.. పైగా, ఏపీకి చెందిన బీజేపీ ఎంపీతో సన్నిహిత సం బంధాలు ఉండడం.. అవి.. కాంట్రాక్టుల వరకు దారి తీసిన నేపథ్యంలో వీటిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్రంగానే భావిస్తున్నారు. రేపు ప్రజల మధ్యకు ఈ విషయాలను తీసుకువెళ్తే.. ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బందేనన్నది వారు చెబుతున్న మాట.
దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన కీలకంగా మారింది. ఆయన స్పందించి.. దీనిపై ప్రకటన చేస్తారా? లేదా.. సమయం కోసం వేచి చూస్తారా? అనేది ఆసక్తిగా ఉంది. ఇప్పటి వరకు అయితే.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ వ్యవహారంపై ఎవరూ నోరు విప్పలేదు. అలాగని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించనూ లేదు. కానీ.. దీనిపై స్పందించాల్సిన అవసరం అయితే.. ఉందని నాయకులు అంతర్గతంగా అభిప్రాయపడుతున్నా రు. మరి దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తారో.. లేదో .. చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates