మిథున్ కోరికలు తీర్చలేనివి

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన రూ.3500 కోట్ల మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఏ-4గా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆగస్టు 1వ తేదీ వరకు మిథున్‌ను రిమాండ్‌కు పంపుతూ విజయవాడలోని ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయ‌న‌ను పోలీసులు ఆదివారం రాత్రి రాజ‌మండ్రి జైలుకు తరలించారు.

చిత్రం ఏమిటంటే.. గతంలో చంద్రబాబును ఉంచిన సెల్‌లోనే మిథున్‌ను కూడా పెట్టారని వార్తలు వచ్చాయి. అంతేకాదు.. అదే సెల్‌లో చంద్రబాబు కూర్చున్న చోటే కుర్చీలో కూర్చోవాల్సి వచ్చిందని కూడా వార్తలు వెలుగుచూశాయి.

ఇదిలా ఉండగా.. తనకు ఇంటి భోజనం, సహాయకుడు (అటెండర్), పేపర్లు, ఏసీ, మినరల్ వాటర్ సహా మొత్తం 15 రకాల సౌకర్యాలు కావాలని మిథున్ రెడ్డి కోర్టులో మూడు పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ జరిపిన కోర్టు, గత సోమవారం అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మిథున్ కోరినవన్నీ ఏర్పాటు చేయాలని రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.

కానీ.. తాజాగా జైలు సూపరింటెండెంట్ రాహుల్, ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు మిగతావన్నీ ఏర్పాటు చేస్తామని, కానీ ఇంటి భోజనం, అటెండర్‌ను మాత్రం ఇవ్వలేమన్నారు. వాస్తవానికి “అటెండర్”కు సంబంధించిన సూచన జైలు మాన్యువల్‌లోనే లేదని తెలిపారు.

ఇక ఇంటి భోజనం విషయంలో భద్రతా పరంగా మిథున్ “వై” కేటగిరీలో ఉన్నారని, ఇంటి ఆహారం కలుషితమైతే ఆరోగ్యపరమైన సమస్యలు రావొచ్చని చెప్పారు. కాబట్టి రోజుకు మూడు పూటలు భోజనం ఇంటి నుంచి తీసుకొచ్చే అవకాశం లేదన్నారు. అయితే పండ్లు, బిస్కెట్లు, ఉడికించని పదార్థాలను మాత్రం ఇంటి నుంచి అనుమతిస్తామని కోర్టుకు వివరించారు. దీనిపై నిర్ణయం పునరాలోచించాలని కోర్టును కోరారు.

ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకున్న ఏసీబీ కోర్టు, మిథున్ రెడ్డికి కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. దీంతో మిథున్ రెడ్డి కోరికలు ఏమేర‌కు నెరవేరుతాయో వేచి చూడాల్సిందే.

ఇవీ మిథున్ కోరిక‌లు..

  • టీవీ.
  • మెత్త‌టి ప‌రుపు.
  • వెస్ట్రన్ కమోడ్ ఉండే టాయిలెట్‌.
  • మూడు పూట్ల బయట నుంచి భోజనం.
  • చిరుతిళ్లు.
  • టిఫిన్లు, టీ , కాఫీ, పాలు.
  • దోమ తెర.
  • యోగా చేసుకునేందుకు మ్యాట్.
  • వాకింగ్ షూస్.
  • వార్త పత్రికలు.
  • ఒక‌ స‌హాయ‌కుడు.
  • మెడిసిన్
  • నోట్ బుక్స్
  • పెన్నులు