దేశానికి వరుసగా సుదీర్ఘకాలం పాటు సేవలందించడంలో ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును నెల కొల్పారు. ఇదే సమయంలో గతంలో ఇదేవిధంగా సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించిన మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ రికార్డును ఆయన అధిగమించారు. మరీ ముఖ్యంగా గాంధీయేతర వ్యక్తి ఇలా రికార్డు సమయం పాటు దేశాన్నిపాలించడం.. మరో సంచలన విషయం.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో రాజకీయ మైలురాయిని అధిగమించారు, ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి, ఒకే పదవిలో నిరంతరాయంగా కొనసాగిన 2వ ప్రధానిగా రికార్డు దక్కించుకున్నారు. జూలై 25, 2025 నాటికి ప్రధాని మోడీ 4,078 రోజులు పూర్తి చేసుకున్నారు, జనవరి 1966- మార్చి 1977 మధ్య ఇందిరా గాంధీ వరుసగా 4,077 రోజులు ప్రధానిగా సేవలందించారు.
ఈ విజయం ప్రధాని మోదీ రాజకీయ ప్రయాణంలో ఒక చారిత్రాత్మక అధ్యాయాన్ని నమోదు చేసింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీ.. దాదాపు 24 సంవత్సరాలుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నికైన ప్రభుత్వాలకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తున్నారు. ఇది మరే ఇతర భారత ప్రధానమంత్రికి సాధ్యం కాని ఘనతగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవీ.. మోడీ ప్రత్యేకతలు..
- దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. జన్మించిన వ్యక్తి ఇలా సుదీర్ఘకాలం దేశాన్ని పాలించడం.
- హిందీయేతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి.. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేయడం.
- దేశంలో అత్యధిక కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రి.
- లోక్‌సభ ఎన్నికల్లో(2014, 2019) స్పష్టమైన మెజారిటీ సాధించిన ఏకైక కాంగ్రెసేతర ప్రధానమంత్రి.
- బీజేపీని వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడం.
- గతంలో జవహర్‌లాల్ నెహ్రూ మాత్రమే ఉన్న ఈ ఘనతను మోడీ సాధించారు.
- గుజరాత్‌లో వరుసగా మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకుని సీఎం అయ్యారు.
- కేంద్రంలో వరుసగా మూడు సార్లు విజయం దక్కించుకుని ప్రధాని పీఠం అధిరోహించిన ఏకైక నాయకుడు మోడీనే.
Gulte Telugu Telugu Political and Movie News Updates