నా జీవితం అంత ఈజీకాదు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్‌.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న జీవితం అంత ఈజీగా.. సాఫీగా న‌డ‌వ‌లేదన్నారు. అనేక ఇబ్బందులు క‌ష్టాలుప‌డ్డానని చెప్పారు. “నా జీవితం వ‌డ్డించిన విస్త‌రి కాదు.” అని తెలిపారు. జీవితం అనే ప్ర‌యాణంలో అనేక ఇబ్బందులు ప‌డ్డాన‌న్నారు. ప్ర‌స్తుత ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నప్పటికీ.. త‌నేమీ ప్ర‌శాంతంగా లేన‌ని చెప్పారు. తాజాగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు స‌క్సెస్ మీట్ కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. త‌న సినిమాను విడుద‌ల చేసుకునేందుకు ఇబ్బందులు ప‌డిన‌ట్టు చెప్పారు.

యాంటీ ప్ర‌చారాన్ని జ‌యించే శ‌క్తి ఇవ్వాల‌ని భ‌గ‌వంతుడిని కోరుకున్న‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. “నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నా. రోజూ అనేక పంచాయ‌తీల‌కు సంబంధించి స‌మ‌స్యలు వ‌స్తూనే ఉంటాయి. కానీ, నా సినిమా(వీర‌మ‌ల్లు)నే నాకు పెద్ద పంచాయ‌తీగా మారింది. ఈ సినిమా అంత సులువుగా విడుద‌ల కాలేదు. అనేక రోజులు నిద్ర‌లేని రాత్రులు కూడా గ‌డిపాను.” అని ప‌వ‌న్ క‌ల్యాణ్ వెల్ల‌డించారు. సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంచుకునేందుకు నిర్మాత‌లు త‌న‌ను క‌లిసిన‌ప్పుడు అనేక కోణాల్లో ఆలోచ‌న చేయాల్సి వ‌చ్చింద‌న్నారు.

చివ‌ర‌కు సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద‌కు ఫైలు పంపించామ‌ని.. అంద‌రూ కోరిన‌ట్టుగానే తాము కూడా కోరామ‌ని.. ప్ర‌భుత్వంలో ఉన్నాం క‌దా.. అని ఎక్కువ‌, త‌క్కువ‌లు చూపించ‌లేద‌న్నారు. అయినా.. విమ‌ర్శ‌లు ఎదుర్కొనాల్సి వచ్చింద‌న్నారు. “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాను బాయ్‌కాట్ చేయాల‌ని కొంద‌రు(వైసీపీ) పిలుపునిచ్చారు. కానీ, వారిని నేను ఒక్క‌టే ప్ర‌శ్నిస్తున్నా.. ఈ సినిమా మిమ్మ‌ల్ని అంత‌గా భ‌య పెట్టిందా?” అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించారు. త‌న వ‌ర‌కు ఈ సినిమా బాగానే ఉంద‌న్న ఆయ‌న‌.. క్ల‌యిమాక్స్ బాగుంద‌నే టాక్ రావ‌డం త‌న‌కు సంతృప్తినిచ్చింద‌ని తెలిపారు.