ఏపీలో తొలిసారి మెట్రో రైలు ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇప్పటి వరకు కాయితాలకే పరిమితమైన ఈ రెండు ప్రాజెక్టులపై చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తొలి దశ టెండర్లను పిలిచి.. పనులు ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం.. తొలి విడత టెండర్లను ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు రెడీ చేశారు. విశాఖ, విజయవాడల్లో ఈ మెట్రో రైళ్లు ప్రజలకు అందుబాటులో రానున్నాయి.
మొత్తం రెండు దశల్లో మెట్రో రైళ్ల ప్రాజెక్టులు పూర్తికానున్నాయి. వీటి నిర్మాణానికి సుమారు 21.600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. గతంలోనూ ఇదే తరహా ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో శ్రీకారం చుట్టినా.. అవి ముందుకు సాగలేదు. ఇంతలో వైసీపీ సర్కారు రావడంతో అవి పూర్తిగా వెనక్కి మళ్లాయి. ఈ సారివీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం వచ్చే మూడేళ్లలో వీటిని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులను అందించనుం ది.
విశాఖపట్నంలో భీమిలి వరకు.. విజయవాడలో అమరావతి చుట్టూ ఉండే ప్రాంతాల్లోనూ.. ఈ మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం తొలి విడత కింద.. 40 శాతం పనులకు టెండర్లను పిలవనున్నారు. వీటిలో విశాఖ మెట్రో రైలుకు 11,498 కోట్ల రూపాయలతో, విజయవాడ మెట్రోకు 10,118 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవనున్నారు. అయితే.. తొలి దశకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కేటాయించనుంది. మలిదశలో పూర్తిగా కేంద్రం తన వాటా ఇచ్చేలా నిర్ణయించింది.
తొలి దశలో ఇచ్చే సొమ్ము ఇదీ..
- విశాఖపట్నంలో నిర్మించే మెట్రో ప్రాజెక్టుకు.. విశాఖ మెట్రో రైల్ డెవలప్ మెంట్ అథారిటీ నుంచి 4100 కోట్లు ఇవ్వనున్నారు. అనంతరం … ఈ నిర్మాణాలను చూపించి కేంద్రం నుంచి రావాల్సిన సొమ్మును రాబట్టనున్నారు.
- విజయవాడ మెట్రోకు రాజధాని అమరావతి నిధులను వెచ్చించనున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ(సీఆర్ డీఏ) నుంచి 3500 కోట్ల రూపాయలను కేటాయిస్తారు. వీటిని విడతల వారీగా నిర్మాణ సంస్థకు ఇవ్వనున్నారు. మిగిలిన మొత్తాన్ని కేంద్రం నుంచి తీసుకుంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates