2014లో జనసేన పార్టీనైతే మొదలుపెట్టాడు కానీ.. కొన్ని నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు. ఐతే సొంతంగా పోటీ చేయకున్నా.. ఆయన ప్రచారం చేసిన తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ కూటమి గెలవడంతో పవన్ ఇమేజ్ పెరిగింది. కానీ గత ఏడాది నేరుగా ఎన్నికల బరిలో దిగితే మాత్రం చేదు అనుభవం ఎదురైంది. జనసేనకు ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే దక్కింది. ఎంతో ఆలోచించి వ్యూహాత్మకంగా పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయాడు.
దీంతో జనసేన గాలి తీసేసినట్లయింది. ఇది జనసేనానికి అవమాన భారాన్ని మిగిల్చింది. ఐతే దాన్నుంచి త్వరగానే కోలుకుని 2024 ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేసే ప్రయత్నంలో ఉన్నాడు పవన్. కానీ ఇప్పుడు అనుకోకుండా మళ్లీ జనసేనను ఎన్నికల బరిలో నిలపాల్సిన సందర్భం వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోతున్నట్లు పవన్ నిన్ననే ఖరారు చేశాడు.
ఐతే తెలంగాణలో జనసేన బలం ఏమాత్రం అన్నది ప్రశ్న. పవన్‌కు ఇక్కడ అభిమానులు భారీగానే ఉండొచ్చు. కానీ వారిలో ఓట్లేసేంత అభిమానం ఉందా అన్నది సందేహం. ఆంధ్రాలోనే అభిమానులందరూ పవన్ పార్టీకి ఓటేయలేదన్నది గత ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది. మరి బలం అంతంతమాత్రం అనుకున్న చోట జనసేనకు ఏమాత్రం ఓట్లు పడతాయన్నది సందేహం. బీజేపీతో పొత్తు ఉంటే అది వేరే కథ. కానీ ఆ పార్టీ సొంతంగా పోటీ చేస్తోంది. జనసేన వేరుగా బరిలో నిలవబోతోంది. అసలు జనసేన అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేస్తాడా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
పెద్దగా బలం లేని చోట పవన్ పోటీ చేసి పార్టీ అభ్యర్థులు ఓడిపోతే, లేదా కనీస స్థాయిలో ఓట్లు పడితే.. అది ప్రత్యర్థులకు అవకాశంగా మారుతుంది. ఎద్దేవా చేస్తారు. అలా అని పవన్ ప్రచారానికే వెళ్లకుండా ఉండిపోతే.. పార్టీ అధ్యక్షుడు ప్రచారం చేయనపుడు అభ్యర్థులను నిలబెట్టడం ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇక పవన్ ప్రచారానికి వెళ్తే అధికార పార్టీని ఏమేర విమర్శిస్తాడన్నదీ సందేహమే. ఈ నేపథ్యంలో జనసేనను జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో నిలపాలన్న నిర్ణయంతో పవన్ ఇరుకున పడ్డట్లే కనిపిస్తోంది.