‘రియ‌ల్ ఎస్టేట్’ రంగానికి బూస్ట్‌ : చంద్ర‌బాబు నిర్ణ‌యం

ఏపీలో గ‌త వైసీపీ హ‌యాంలో రియ‌ల్ ఎస్టేట్ రంగం భారీగా కుదేలైంది. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల కార్మికులు రోడ్డున ప‌డ్డారు. పెట్టుబ‌డి దారులు పొరుగు రాష్ట్రాల‌కు త‌ర‌లిపోయారు. ప‌నులు లేక‌.. ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ్డారు. దీనికితోడు.. ప్ర‌భుత్వానికి కూడా ఆదాయం త‌గ్గిపోయి.. అప్పులు చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ అంశాల‌పై గ‌త ఏడాది కాలంగా దృష్టి పెట్టిన చంద్ర‌బాబు.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార ప్ర‌తినిధుల‌తో త‌ర‌చుగా బేటీ అయ్యారు. వారి స‌మ‌స్య‌లు ఆల‌కించారు.

ఈ క్ర‌మంలో తాజాగా స‌ర్కారు త‌ర‌ఫున కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రియ‌ల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఇచ్చేలా చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ నిర్ణ‌యాల ఫ‌లితంగా రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌నులు జోరుగాసాగుతాయ‌ని కూడా లెక్క‌లు వేసుకుంటున్నారు. మ‌రీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల‌కు త‌ర‌లిపోయి న పెట్టుబ‌డి దారులు తిరిగి వ‌స్తార‌ని అంచ‌నా వేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్రోత్సాహ‌కాలు అందిస్తూ.. కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

ఇవీ.. నిర్ణ‌యాలు..

  • రియ‌ల్ ఎస్టేట్ రంగానికి కూడా అత్యంత‌ త‌క్కువ ధ‌ర‌ల‌కు ఇసుక పంపిణీ.
  • భూ యజమానులతో చేసుకునే డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌, జీపీఏ కింద 4% వరకు ప్ర‌భుత్వం వ‌సూలు చేసే స్టాంపు డ్యూటీని 1 శాతానికి త‌గ్గించారు.
  • నరెడ్కో, క్రెడాయ్‌లకు ప్రోత్సాహాలు. కోరిన చోట భూములు కేటాయించేలా కొత్త విధానానికి శ్రీకారం.
  • అన్ని అనుమ‌తులు.. సింగిల్ విండో విధానంలో అమ‌లు.
  • డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌లు చేసేందుకు అధికారులు క్షేత్ర‌స్థాయికి వ‌చ్చేలా ఏర్పాట్లు.
  • ఆఫీసుల చుట్టూ బిల్డ‌ర్లు తిర‌గ‌కుండా.. వారికి అన్ని అనుమ‌తులు ఆన్‌లైన్‌లో ఇచ్చేలా నిర్ణ‌యం.
  • భూ వినియోగ మార్పిడి(నాలా) అనుమతులు పంచాయ‌తీ, మునిసిపాలిటీల నుంచి తీసుకునేలా వెసులుబాటు.
  • ఇళ్లు, భవనాలు నిర్మించుకోవాలనుకునే వారికి సెల్ఫ్ అఫిడ‌విట్‌ పథకం అమ‌లు.