‘జ‌గ‌న్‌ను విచారిస్తే.. అన్నీ బ‌య‌ట‌కు వ‌స్తాయి’

జ్యోతుల నెహ్రూ. ఒక‌ప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు. ఆ పార్టీలో గ‌త ఐదేళ్లు కూడా ఉన్నారు. అయితే, 2024 ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ మారి టీడీపీ గూటికి చేరుకున్నారు. ఈక్ర‌మంలోనే జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న జ్యోతుల‌.. తాజాగా మిథున్ రెడ్డి అరెస్టు, జైలు నేప‌థ్యంలో స్పందించారు. జ‌గ‌న్ కూడా జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌న్నారు. అస‌లు ఈ కేసులో జ‌గనే సూత్ర‌ధారి అని పేర్కొన్నారు. ముందు జ‌గ‌న్‌ను విచారిస్తే.. అన్నీ బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చెప్పారు.

“ఈ విచార‌ణ అంతా ఒక‌ర‌కంగా.. సుదీర్ఘంగా సాగుతోంది. ఇంత సాగ‌దీత ఎందుకో నాకు అర్ధం కావ‌డం లేదు. జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తే.. మ‌ద్యం ముడుపులు, అక్ర‌మాలు తేల్చేయొచ్చు. 3500 కోట్ల వ్య‌వ‌హారంపై ఎందుకు ఇంత‌గా సాగ‌దీస్తున్నారు. ముందు జ‌గ‌న్‌ను అరెస్టు చేయాలి.” అని జ్యోతుల వ్యాఖ్యానించారు. అయితే.. చ‌ట్టం త‌న ప‌నితాను చేసుకుని పోతుంద‌న్నారు. ముఖ్యంగా ఇప్పుడు కాక‌పోతే.. రేప‌యినా.. నిజాలు వెలుగు చూస్తాయ‌ని జ్యోతుల తెలిపారు. జ‌గ‌న్ ఎవ‌రెవ‌రిని మోసం చేశారో.. ఎన్ని వేల కోట్లు రాబ‌ట్టారో వెలుగు చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. జ‌గ‌న్ మోసాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు తాము రెడీగా ఉన్నామ‌ని చెప్పారు.

వైసీపీ నుంచి విజ‌య‌సాయిరెడ్డి చాలా వ్యూహాత్మ‌కంగా బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని జ్యోతుల చెప్పారు. ఆయ‌న‌కు అన్నీ తెలుసున‌ని.. కానీ, త‌న వాటా త‌న‌కు ద‌క్క‌లేద‌న్న క‌సితోనే.. బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని ఆరోపించారు. త్వ‌ర‌లోనే సాయిరెడ్డి అప్రూవ‌ర్‌గా మారే అవ‌కాశం ఉంద‌ని త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నారు. అయితే.. ఎవ‌రు ఏంచేసినా.. ప్ర‌జ‌ల ముందు దోషులుగా నిల‌బెట్టేందుకు కూట‌మి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. తాజాగా ఆదివారం ఆయ‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ అధినేత తీరును తాను చాలా స‌మీపం నుంచి గ‌మ‌నించాన‌ని చెప్ప‌కొచ్చారు. ఆయ‌న మాన‌సిక స్థితి స‌రిగా లేద‌ని వ్యాఖ్యానించారు.