ఏపీ సీఎం చంద్రబాబు అంటే.. ఉప్పు-నిప్పుగా వ్యవహరించే బీజేపీ సీనియర్ నేత, ఏపీ మాజీ చీఫ్.. ప్రస్తుత ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. తాజాగా బాబు సహా.. మంత్రి నారా లోకేష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ పై విమర్శలు గుప్పిస్తూ.. జగన్ పాలనను ఎండగట్టారు. అంతేకాదు.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని అనుకోవడం కల్లేనని తేల్చేశారు. అరాచకాలు.. అకృత్యాలతో సాగిన పాలనను ప్రజలు ఇంకా మరిచిపోలేదని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు వీర్రాజు. ఇదేసమయంలో ఆయన చంద్రబాబు భారీ క్లూ కూడా ఇచ్చారు. వైసీపీపై కేసులు పెట్టడంలో సర్కారుకు ఈ క్లూ మరింత ఉపయోగనుందని పరిశీలకులు చెబుతున్నారు.
ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్.. గత ఏడాది ఎన్నికలకు ముందు యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ సమయంలో వైసీపీ నాయకులు అడ్డంకులు సృష్టించారు. అప్పట్లోనే నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో వారిని హెచ్చరించారు. అయితే.. తాజాగా సోము వీర్రాజు.. ఆనాటి సంగతులు గుర్తు చేశారు. యువగళం పాదయాత్ర సమయం లో వైసీపీ నాయకులు కుట్రలు చేశారని.. నారా లోకేష్‌ను లేకుండా చేసే ప్రయత్నాలు కూడా సాగినట్టు తనకు సమాచారం ఉందని చెప్పారు.(అయితే అప్పట్లో ఎందుకు చెప్పలేదో ఆయన సమాధానం ఇవ్వలేదు).
ఈ నేపథ్యంలో ఆనాడు యువగళం పాదయాత్ర జరిగిన ప్రాంతాల్లో వైసీపీ నాయకులు సృష్టించిన అడ్డంకులపై తాజాగా దృష్టి పెట్టాలన్నారు. నాడు.. జరిగిన అక్రమాలు, అరాచకాలపై ముఖ్యంగా యువగళం పాదయాత్రపై జరిగిన కుట్రలను వెలికి తీయాల న్నది వీర్రాజు చెబుతున్న మాట. ఇది నిజమే. ఈ ఆలోచన బహుశ ఇప్పటి వరకు టీడీపీనాయకులకు కూడా రాలేదు. నిజానికి ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు.. పెట్టిన కేసులు గమనిస్తే.. సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు, కార్యకర్తలపై జరిగిన హత్యా యత్నాలకు మాత్రమే సంబంధించి ఉన్నాయి. ఈ కేసుల్లోనే వైసీపీ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates