ఈటెలను వెన్నుపోటు పొడిచిన సొంత పార్టీ వాళ్లు ఎవరబ్బా?

త‌న‌ను సొంత పార్టీ వాళ్లే వెన్నుపోటు పొడిచార‌ని.. బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. తాజాగా ఆయ‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో గ‌త 2023 ఎన్నిక‌ల్లో జ‌రిగిన ప‌రిణామాలు స‌హా.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను కూడా వివ‌రించారు. ఇటీవ‌ల కాలంలో కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కు.. ఆయ‌న‌కు మ‌ధ్య వివాదాలు ముసురుకున్న విష‌యం తెలిసిందే. హుజూరాబాద్‌లో ఈట‌ల‌కు చెక్ పెట్టే విధంగా మంత్రి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈట‌ల వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

2023 ఎన్నిక‌ల్లో హుజూరాబాద్ నుంచి తాను పోటీ చేసిన‌ప్పుడు.. సొంత పార్టీ నాయ‌కులే త‌న‌కు వెన్నుపోటు పొడిచార‌ని ఈట‌ల వ్యాఖ్యానించారు. అయినా.. తాను ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుని ఎంపీగా విజయం ద‌క్కించుకున్నాన‌న్నారు. వ్య‌క్తుల‌ పై తాను ఎప్పుడూ ఆధార‌ప‌డ‌లేద‌న్న ఆయ‌న‌.. పార్టీని, ప్ర‌జ‌ల‌ను మాత్ర‌మే న‌మ్ముకున్నాన‌ని చెప్పారు. కార్య‌క‌ర్త‌లే త‌న‌కు కొండంత బ‌ల‌మ‌ని ఈట‌ల వ్యాఖ్యానించారు. వారిని కూడా త‌న‌కు దూరం చేసేందుకు కొంద‌రు కుట్ర‌లు పన్నుతున్నార‌ని చెప్పారు.

త‌న‌పైనా.. త‌న కుటుంబంపైనా కూడా.. సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తూ.. త‌న ఇమేజ్‌కు భంగం క‌లిగించేలా కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. అయితే..ఎక్క‌డా ఎవ‌రి పేరును ఈట‌ల ప్ర‌స్తావించ‌లేదు. బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి చాలానే కార‌ణాలు ఉన్నాయ‌న్నారు. అయితే..ఎక్క‌డ ఉన్నా.. ఆ పార్టీ బాగుండాల‌ని.. కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌లు బాగుండాల‌ని తాను కోరుకుంటాన‌ని ఈట‌ల వ్యాఖ్యానించారు. తాను ప‌ద‌వుల కోసం ఎప్పుడూ వెంప‌ర్లాడ‌లేద‌న్నారు. ప‌ద‌వుల కోసం పార్టీలు మార‌లేద‌ని చెప్పారు.

“గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌కు నా నిర్ణయాలు మొహమాటం లేకుండా చెప్పాను. గతంలో హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో ప్రజల ఆత్మగౌరవం గెలిచింది. నేను అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ప‌నిచేస్తున్నా. కానీ.. కొంద‌రికి ఇది న‌చ్చ‌డం లేదు. అయినా.. నేను ప్ర‌జ‌ల‌నే న‌మ్ముకున్నా.. నా కార్య‌క‌ర్త‌లే నాబ‌లం” అని ఈట‌ల తేల్చి చెప్పారు.