ఏపీ సీఎం చంద్రబాబు.. వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఆయన స్పందించారు. పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు వైసీపీ మద్యం కుంభకోణం.. ఈ కేసును విచారి స్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరు, వారు చేస్తున్న అరెస్టులు వంటివాటిని ప్రస్తావించారు.
ఈ కేసు దాదాపు కొలిక్కి వచ్చిందని చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు కూడా వెనక్కి తగ్గిన విషయాన్ని ప్రస్తావించారు. బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు వెనక్కి తగ్గాయంటే.. కేసు తీవ్రత ఎలా ఉందో అర్ధమవుతుందన్నారు.
ఈ క్రమంలో అసలు దొంగలు దొరుకుతున్నారని, ముఖ్యంగా గత పాలకుడు(జగన్) కూడా దొరికిపోయాడని చంద్రబాబు చెప్పారు. దీనిని వదిలి పెట్టేది లేదన్న ఆయన.. త్వరలోనే దీనిని ప్రజలకు వివరించేందుకు నాయకులు ప్రజల మధ్యకు వెళ్లాలని సూచించారు.
ఇప్పటి వరకు తాను మాట్లాడకపోవడానికి కారణం.. సిట్ విచారణ జరుగుతుండడమేనని, తాను ఏం చెప్పినా.. ఆ ప్రభావం విచారణపై పడుతుందన్న ఉద్దేశంతోనే మాట్లాడలేదన్నారు. ఇప్పుడు అంతా బయటకు వచ్చిన నేపథ్యంలో ఇక వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.
జగన్ తాను.. తప్పులు చేసి.. వాటిని టీడీపీ నేతల పైనా.. తనపైనా వేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయంలో నాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ.. విష ప్రచారం చేస్తున్న జగన్‌ను, ఆయన పరివారాన్ని ఎక్కడికక్కడ నిలువరించాలన్నారు.
ఈ విషయంలో ఎవరూ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అవసరమైతే.. పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ మద్యం కుంభకోణం విషయాన్ని కూడా లేవనెత్తి.. చర్చకు పెట్టాలన్నారు. సిట్ కూడా.. త్వరలోనే నివేదిక ఇస్తుందన్న చంద్రబాబు.. జగన్ చేస్తున్న వ్యతిరేక ప్రచారానికి ఎప్పటికప్పుడు.. కౌంటర్ ఇచ్చేలా నాయకులు వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates