వినుత డ్రైవర్ హత్య.. బొజ్జల సమాధానమిదే

శ్రీకాళహస్తి జనసేన నేత వినుత కోట, ఆమె భర్త.. తమ డ్రైవర్‌ శ్రీనివాసులును హత్య చేసిన కేసులో అరెస్టవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుపారీ కిల్లర్లను పెట్టి శ్రీనివాసులును చంపించిన వినుత, ఆమె భర్త.. మృతదేహాన్ని చెన్నైలో పడేసి వచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో వీళ్లిద్దరితో పాటు మరి కొందరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో దీని వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నట్లు వినుత ఆరోపించారు.

దీంతో బొజ్జల సుధీర్‌ను జనసైనికులతో పాటు వైసీపీ వాళ్లు టార్గెట్ చేస్తున్నారు. శ్రీనివాసులుకు డబ్బులు ఆశచూపించి.. వినుతకు సంబంధించి పర్సనల్ వీడియోలు తీయించారని.. వాటిని చూపించి సుధీర్ బ్లాక్ మెయిల్ చేశారని.. ఆమెకు టికెట్ రాకుండా అడ్డుకోవడానికే ఇదంతా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐతే ఇప్పటిదాకా సుధీర్ ఈ ఆరోపణల గురించి స్పందించలేదు. తాజాగా ఆయన తన అనుచరులతో కలిసి తిరుమల శ్రీవారిని కలిశారు. బయటికి వచ్చాక తన మీద వస్తున్న ఆరోపణల గురించి స్పందించారు.

తిరుమలలో రాజకీయాల గురించి మాట్లాడరని.. కానీ తన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో నిజం చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు. తనకు కూడా కుటుంబం ఉందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని.. తాను వాళ్లు ఆరోపిస్తున్నట్లు అలాంటి పనులు చేయనని సుధీర్ అన్నారు. కేసుతో తనకు ఎంతమాత్రం సంబంధం లేదని.. దేవుడి సాక్షిగా, తన కుటుంబం సాక్షిగా ఈ మాటలు చెబుతున్నానని సుధీర్ తెలిపారు. వినుత కోటతో తనకు రాజకీయంగా ఎలాంటి గొడవలూ లేవని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు కావాలనే తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.