ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి.. కీలక మార్పులు తెరమీదికి వచ్చాయి. నిన్న మొన్నటి వరకు అమరావతి అంటే.. కేవలం ప్రభుత్వ కార్యాలయాలు.. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు.. అధికారుల నివాసాలకే పరిమితమని అనుకున్నారు. అసలు వాస్తవ ప్లాన్ కూడా అక్కడికే పరిమితం అయింది. కానీ, ఇప్పుడు ఈ ప్రణాళిక పూర్తిగా మారనుంది. గతంలో చేపట్టిననిర్మాణాలు.. వేసిన ప్లాన్లు అలానే సాగినా.. ఇప్పుడు సేకరించనున్న 44 వేల ఎకరాల్లో చేసే నిర్మాణాలు.. అదేవిధంగా ఇప్పటికే తీసుకున్న భూములకు సంబంధించి వేసిన ప్లాన్‌లలో కొన్ని మారనున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
తాజాగా అమరావతి అభివృద్ధి, ఆర్థిక పరమైన సంస్థల నిర్మాణాలపై టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో ఇచ్చిన స్వర్ణాంధ్ర-2047లో కీలక ప్రాజెక్టులను కొత్తగా ప్రతిపాదించారు. వీటిలో హైటెక్ సిటీ, ఏఐ యూనివర్సిటీ, సెమీ కండెక్టర్ల నిర్మాణ సంస్థలు వంటివి ఉన్నాయి. అదేవిధంగా దేశ రక్షణ రంగానికి సంబంధించిన పలు సంస్థలు కూడా ఉన్నాయి. వీటిని ఇక్కడ డెవలప్ చేయాలన్నది టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదికలో స్పష్టంగా ఉంది. అమరావతిని అంతర్జాతీయస్థాయికి చేర్చాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు.. సెమీకండెక్టర్ల నిర్మాణ సంస్థలను అమరావతిలో ఏర్పాటు చేయడాన్ని టాస్క్ ఫోర్స్ ప్రధానంగా ప్రస్తావించింది.
ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న హైటెక్ సిటీని మించి.. అమరావతిలో హైటెక్ సిటీని ఏర్పాటు చేయాలన్న సంకల్పం కూడా.. దీనిలోనే ఉంది. తద్వారా.. అమరావతి అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. అలానే.. ఐటీ పార్కులను అమరావతిలో ఏర్పాటు చేయడం కాకుండా.. తిరుపతి, విశాఖ, అనంతపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని టాస్క్ ఫోర్స్ ప్రతిపాదించింది. అలాగే ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా పేర్కొంది. ఈ ప్రతిపాదనలు సాకారం అయితే.. అమరావతి ఇప్పుడు అనుకుంటున్న దానికంటే కూడా.. ఎక్కువ ఖ్యాతిని సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates