`క్లెమోర్ మైన్లే ఏం చేయ‌లేక‌పోయాయ్‌` జ‌గ‌న్‌కు ఇచ్చిప‌డేసిన బాబు

“మూడేళ్లు క‌ళ్లు మూసుకుంటే.. చంద్ర‌బాబు ఎగిరిపోతాడు.“ అని వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన తీవ్ర వ్యాఖ్యల‌పై సీఎం చంద్ర‌బాబు చాలా గ‌ట్టిగా రియాక్ట్ అయ్యారు. `క్లెమోర్ మైన్లే న‌న్ను ఏం చేయ‌లేక‌పోయాయ్‌` అని వ్యాఖ్యానించారు. ఇక‌, నువ్వు (జగన్) ఎంత‌? నీ రాజ‌కీయం ఎంత‌? అని అన్నారు. పిల్ల రాజ‌కీయాలు చేసుకునే వారు.. నేర‌స్థులతో తాను కొట్లాడాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

“నేను సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నా. ఇలాంటి వాళ్ల‌ను ఎప్పుడూ చూడ‌లేదు. ఎప్పుడూ ఇలాంటి వారితో రాజ‌కీయాలు కూడా చేయ‌లేదు. పిల్ల రాజ‌కీయాలు చేస్తున్నారు. తోక‌లు క‌త్తిరిస్తా. ఖ‌బ‌డ్దార్‌“ అని హెచ్చ‌రించారు. “న‌న్ను లేపేస్తావా? నీత‌రం కాదు. గుర్తు పెట్టుకో. నీ తిట్లు, శాప‌నార్థాలు.. కూడా న‌న్నేమీ చేయ‌లేవు. న‌న్ను తాక‌వు కూడా. ముందు నిన్ను నువ్వు కాపాడుకో.“ అని జ‌గ‌న్‌పై కేసుల విష‌యాన్ని ప‌రోక్షంగా చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

బుధ‌వారం వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని.. నిండా క‌ళ్లు మూసుకుంటే.. మూడేళ్ల‌లో చంద్ర‌బాబు ఎగిరిపోతాడ‌ని అప్పుడు తామే అధికారంలోకి వ‌స్తామని చెప్పారు. ఈ వ్యాఖ్య‌లు రాజకీయంగా దుమారం రేపాయి. ఇప్ప‌టికే టీడీపీ నాయ‌కులు చాలా మంది జ‌గ‌న్ వైఖ‌రిపై నిప్పులు చెరిగారు.

తండ్రి చ‌చ్చిపోయాక‌, క‌నీసం సింప‌తీ లేకుండా వ్య‌వ‌హ‌రించి.. ముఖ్యమంత్రి సీటు కోసం వెంప‌ర్లాడార‌ని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్ర‌బాబును కూడా అలానే చూస్తున్నారని.. మంత్రుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు నిప్పులు చెరిగారు. తాజాగా సీఎం చంద్ర‌బాబు కూడా జ‌గ‌న్ మాన‌సిక వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. మీ శాస‌నార్థాలు.. తిట్లు న‌న్ను ఏమీ చేయ‌లేవ‌ని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం.