“మా సీఎం రాష్ట్రంలో శాంతి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే నేరస్థులపై ఉక్కుపాదం మోపుతున్నాం. ఆయన ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ కారణంగా.. రాష్ట్రంలో 2017 నుంచి 2025 మార్చి వరకు 14,973 ఆపరేషన్లు చేపట్టాం. వీటిలో 238 మందిని ఎన్కౌంటర్ చేశాం. ఇదంతా సీఎం ఆదేశాలతోనే జరిగింది.” – అని ఉత్తరప్రదేశ్ పోలీసు బాస్( డీజీపీ) రాజీవ్ కృష్ణ మీడియాకు వెల్లడించారు. అంతేకాదు.. 9,467 మంది నేరస్తులకు.. రెండు లేదా ఒక కాలు పనిచేయకుండా చేశామన్నారు. వారి కాళ్లపై కాల్పులు జరిపామన్నారు.
వారంతా కరడుగట్టిన ముఠాకు చెందిన నేరస్థులని డీజీపీ చెప్పడం గమనార్హం. కాగా.. రాష్ట్రంలో ఎన్ కౌంటర్ల సంస్కృతి, బుల్ డోజర్ల సంస్కృతి పెరిగిపోయిందని.. సుప్రీంకోర్టు తీవ్ర విమర్శలు చేసిన రెండు రోజుల్లోనే ఆయన ఈ వివరాలు వెల్లడించడం.. తప్పు తమది కాదని పరోక్షంగా చెప్పడం గమనార్హం. 2017లో తొలిసారి బీజేపీ సీఎం అభ్యర్థిగా సాధువును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనే ఆదిత్య నాథ్. అప్పటి నుంచి ఆయన నేరస్థులపైనా.. నేరాలకు పాల్పడే వారిపైనా ఉక్కుపాదం మోపుతున్నారు.
అయితే.. తరచుగా వీటిపై జాతీయ మానవ హక్కుల సంఘం సహా.. సుప్రీంకోర్టు కూడా తీవ్ర విమర్శలు చేస్తోంది. “నేరస్థులను చంపుకుంటూ పోవడం.. అంటే, శాంతి భద్రతలను కాపాడినట్టా?. పోలీసులకు ఇక, రూల్స్ ఎందుకు.. లాఠీలు ఎందుకు? విచారణలు ఎందుకు? తుపాకీలు ఇచ్చేస్తే.. సరిపోతుంది. జైళ్లు కూడా అవసరం లేదు.” అని నిరుడు ఇదే నెలలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అదేసమయంలో బుల్ డోజర్ల సంస్కృతి ఏంటని.. ప్రశ్నించింది.
కోర్టును ఆశ్రయించిన.. పిటిషనర్లకు(బుల్ డోజర్ కారణంగా ఇళ్లు నేలమట్టం అయిన వారు) ప్రభుత్వం సొంత ఖర్చుతో ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట.. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన సుప్రీంకోర్టు.. యూపీలో గత 8 సంవత్సరాల్లో ఎన్ని ఎన్ కౌంటర్లు జరిగాయో.. వివరించాలని డీజీపీని ఆదేశించింది. అయితే.. ఆయన బహిరంగంగా దీనిపై వివరణ ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు.. తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కూడా ఆత్మరక్షణలో పడింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates