స్వ‌రం పెంచిన కవిత‌.. బీఆర్ఎస్ పై కీల‌క వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత‌.. త‌న స్వ‌రాన్నిపెంచారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు డియ‌ర్ డాడీ ఉత్త‌రానికి.. కుటుంబ రాజ‌కీయాల‌కు ప‌రిమిత‌మైన ఆమె జాగృతి సంస్థ ద్వారా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేందుకు రెడీ అయిన‌ట్టు చెప్పారు. అలానే ఒక‌టి రెండు సార్లు వ‌చ్చారు కూడా. ముఖ్యంగా బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల క‌ల్ప‌న విష‌యంపై క‌విత పోరాట‌మే చేస్తున్నారు. కానీ.. దీనికి బీఆర్ఎస్ నేత‌ల నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు పైగా బీఆర్ఎస్ ఈ విషయాన్ని ప‌క్క‌న పెట్టేసింది.

అదేస‌మ‌యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న క‌విత‌పై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై ఆమె ఒక్కరే పోరాటం చేశారు. ఈ విష‌యంలోనూ బీఆర్ఎస్ ఎక్క‌డా స్పందించ‌లేదు. క‌నీసం ఖండించ‌ను కూడా లేదు. ఆమెకు మ‌ద్ద‌తుగా నిలిచింది కూడా లేదు. దీనిపై ఒక‌వైపు రాజ‌కీయంగా చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో క‌విత అనూహ్యంగా బీఆర్ఎస్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిగా మారింది. ఇప్పుడు కాక‌పోతే.. మ‌రో రెండు రోజుల‌కైనా బీఆర్ఎస్ నాయ‌కులు త‌న దారికి రావాల్సిందేన‌ని ఆమే తేల్చి చెప్పారు.

తాజాగా గురువారం మీడియాతో మాట్లాడిన క‌విత‌.. ప్ర‌జా పోరాటాల విష‌యంలో జాగృతి సూప‌ర్ క్రెడిట్ ద‌క్కించుకుంటోంద‌న్నారు. ఎప్ప‌టికైనా బీఆర్ఎస్ నాయ‌కులు త‌న దారిలోకి రావాల్సిందేన‌ని తేల్చి చెప్పారు. తెలంగాణ బిడ్డ‌పై తీన్మార్ మ‌ల్ల‌న్న తీవ్ర విమ‌ర్శ‌లు చేసి, ఆత్మ‌గౌర‌వానికి భంగం క‌లిగించినా.. బీఆర్ఎస్ నాయ‌కులు స్పందించలేద‌ని.. వాపోయారు.. అయితే.. ఈ విష‌యంపై తాను యాగీ చేయ‌డం లేద‌న్న ఆమె.. వారి విజ్ఞ‌తకే ఈ విష‌యాన్ని వ‌దిలేస్తున్నాన‌ని చెప్పారు.

రేవంత్‌పై విమ‌ర్శ‌లు..

ఈ సంద‌ర్భంగా క‌విత సీఎం రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఢిల్లీలో జ‌రిగిన స‌మావేశంలో బ‌న‌క‌చ‌ర్ల వ్య‌వ‌హారం.. చ‌ర్చ‌కు రాలేద‌న్న‌ది అబ‌ద్ధ‌మ‌ని.. గోదావ‌రి జ‌లాల‌ను త‌న గురువుకు గుత్త‌గా ముట్ట‌చెప్పి వ‌చ్చార‌ని విమ‌ర్శించారు. టెలీ మెట్రిక్ అంశం.. ఢిల్లీ వ‌ర‌కు వెళ్లాల్సిన విష‌యం కాద‌ని.. ఇది ఇక్క‌డ కూర్చునైనా చేయొచ్చ‌ని చెప్పారు. కానీ, కేంద్రాన్ని బూచిగా చూపించి.. ఏపీకి మేలు చేసేలా రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. దీనిపై జాగృతి ప‌క్షాన పోరాటం ముమ్మ‌రం చేయ‌నున్న‌ట్టు క‌విత తెలిపారు.