రాజకీయంగా సీనియర్ నాయకురాలు. గత ఎన్నికల్లో పోటీకి సిద్ధమై.. సొమ్ములు కూడా రెడీ చేసుకున్నారు. కానీ.. ఏం చేస్తారు.. ఈక్వేషన్లు కుదరలేదు. టికెట్ దక్కలేదు. కానీ.. ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన గుర్తింపు ఉందని చెప్పుకొనే ఆమె.. గతంలో కేంద్ర మంత్రిగా చేసి ఉండడంతో చంద్రబాబుకు ప్రాధాన్యం ఇవ్వక తప్పింది కాదు. ఈ క్రమంలోనే ఆమెకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్‌గా నియమించారు. ఎంతో మంది బరిలో ఉన్నా.. కాదని.. ఆమెకు ఇచ్చారు.
అయినా.. సదరు మహిళా నాయకురాలిలో మాత్రం అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. ప్రతి సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్బార్‌కు హాజరు కావాలని సదరు నాయకురాలికి కబురు పెట్టారు. తొలుత నిరాకరించిన.. ఆమె అతి కష్టం మీద మొహమాటానికి అన్నట్టుగా హాజరయ్యారు. ఏదో మమ అని అనిపించారు. ఇంతకీ ఆమెకు ఎలాంటి పదవి కావాలని ఆశ ఉందో అనే చర్చ జరిగింది. కేబినెట్ హోదాతో ఉన్న నామినేటెడ్ పదవి కావాలన్నది ఆమె ఆశ.
మరి ఈ ఆశ, కోరికలు నెరవేరుతాయా? అంటే.. కష్టమేనని చెప్పాలి. వచ్చే ఎన్నికల నాటికి రిటైర్మెంటు జాబితాలో ఉన్న మహిళా నాయకుల పేర్లలో ఈమె పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇక, గుంటూరుకు చెందిన మరో ఎస్సీనాయకురాలు.. కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఈమె వైసీపీ నుంచి.. బయటకు వచ్చిన నాయకురాలు. గత ఎన్నికల్లోనే పోటీ చేయాలని అనుకున్నా.. సేమ్ టు సేమ్ .. ఆమెకు కూడా.. ఈక్వేషన్లు కుదరలేదు. దీంతో ఆమె సామాజిక వర్గానికి చెందిన కార్పొరేషన్ పదవిని ఇచ్చారు.
కానీ దీనిలో చేసేందుకు పనిలేదన్నది ఆమె భావన. పోనీ.. మీడియా ముందుకు వద్దామంటే.. ఇప్పుడే కాదని కొందరు సూచించడంతో ఆగిపోయారు. ఇంతకీ ఈమె అసంతృప్తి కూడా.. సేమే. తనకు ప్రాధాన్యం ఉన్న పదవిని ఇవ్వలేదన్నది ఆమె వాదన. అంతేకాదు.. తన నియోజకవర్గంలో తన పెత్తనం ఉండాలన్న కోరిక కూడా ఉంది. మాజీ ఎమ్మెల్యేనే అయినా.. నియోజకవర్గంలో అందరూ తనమాటే వినాలన్న పంతంతో ఉన్నారు. అలాగని రగడ చేస్తే.. ఇబ్బంది అవుతుందని సైలెంట్ అవుతున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో.. ఈ ఇద్దరు మేడంల అసంతృప్తిపై టీడీపీలో పెద్ద ఎత్తునే చర్చ సాగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates