పేర్నినానికి పిచ్చి పట్టినట్లుంది: కందుల దుర్గేష్

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని ఈ మధ్య చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. చీకట్లోనే సైలెంట్ గా పని కానిచ్చేయాలని…రప్పా రప్పా అంటూ పగటి పూట రచ్చ చేయడం కాదని వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా నాని చేసిన కామెంట్లు దుమారం రేపాయి. మంత్రి కందుల దుర్గేష్ ఇసుక వ్యాపారం చేస్తున్నారంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. ఈ క్రమంలోనే పేర్ని నానికి కందుల దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. తాను ఇసుక వ్యాపారం చేసినట్లు నిరూపించాలని నానికి దుర్గేష్ సవాల్ విసిరారు.

రాజకీయ ఉనికి కోసమే పేర్ని నాని ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుర్గేష్ విమర్శించారు. పేర్ని నాని రేషన్ బియ్యం కేసులో విచారణ జరుగుతోందని అన్నారు. దొంగతనం చేసి డబ్బులు కడితే దొర అయిపోతారా అని దుర్గేష్ ప్రశ్నించారు. అధికారం పోయిన తర్వాత పేర్ని నాని పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలదే గెలుపని జోస్యం చెప్పారు.

కాగా, చాలాకాలంగా పేర్ని నాని వర్సెస్ కందుల దుర్గేష్ అన్నరీతిలో మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీకి చెందిన వ్యక్తి చనిపోతే కూటమి ప్రభుత్వం పతనం మొదలవుతుందని పేర్ని నాని గతంలో వ్యాఖ్యానించారు. కార్యకర్తల చావు మీద వైసీపీ రాజకీయాలు చేస్తోందని, మనుషులు చనిపోవాలి అన్న రీతిలో మూర్ఘంగా పేర్ని నాని మాట్లాడుతున్నారని కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా కార్యకర్తలు చనిపోవడం వల్ల రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నారా అని నిలదీశారు.