కాపులు హ్యాపీస్‌.. విష‌యం ఏంటంటే!

కాపు సామాజిక వ‌ర్గం ఖుషీ అయ్యే వార్త ఇది!. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని వీరి కోరిక‌. అందుకే త‌ర‌చుగా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల్లోనూ.. ఆయ‌న ఎక్క‌డైనా పాల్గున్న‌ప్పుడు కూడా.. సీఎం-సీఎం అంటూ.. పెద్ద ఎత్తున హ‌డావుడి చేస్తున్నారు. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఆ ప‌ద‌వి త‌న‌కు భారమ‌ని ప‌వ‌న్ చెబుతున్నారు. మ‌రో 15 ఏళ్ల వ‌ర‌కు కూట‌మిగానే ఉంటాన‌ని అంటున్నారు. దీంతో కాపులు ఒకింత హ‌ర్ట్ అవుతున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఒక కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్ర‌బాబు ఈ నెలలో నాలుగు రోజుల పాటు.. విదేశాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల 21 నుంచి ఆయ‌న సింగ‌పూర్‌కు వెళ్తారు. అక్క‌డ అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణాల‌కు సంబంధించి చ‌ర్చించ‌నున్నారు. ప‌నిలో ప‌నిగా సింగ‌పూర్‌కు చెందిన సంస్థ లతోనూ పెట్టుబ‌డుల‌పై చ‌ర్చిస్తారు. ఈ ప‌ర్య‌ట‌న‌ను సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. రాజ‌ధానికి నిధులు వ‌చ్చిన నేప‌థ్యంలో ప‌నులు వేగంగా చేప‌ట్టాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలో అవ‌స‌ర‌మైతే.. మ‌రో రెండు రోజులైనా సింగ‌పూర్‌లోనే ఉండి ప‌నులు చ‌క్క‌బెట్టుకుని రావాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో పాల‌న‌ను ఎవ‌రు చూస్తారు? అనేది కీల‌కం. గ‌తంలో అయితే.. చంద్ర‌బాబే ఎక్క‌డ ఉన్నా.. పాల‌న‌ను మేనేజ్ చేసేవారు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. ఈ నేప‌థ్యంలో ‘ఇంచార్జ్ ముఖ్య‌మంత్రి’గా ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ్య‌త‌లు చూస్తారంటూ.. అన్ని శాఖ‌ల‌కు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ఆదేశాలు జారీ చేసింది.

ఈ విష‌యాన్ని అధికారులు కూడా ధ్రువీక‌రించారు. ఈ రోజో రేపో.. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు కూడా వెలువ‌డ‌నున్నాయ‌ని.. అధికారికంగానే సీఎం చంద్ర‌బాబు ప‌వ‌న్‌కు ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నార‌ని.. చెబుతున్నారు. దీంతో కాపులు హ్యాపీగా ఫీల‌య్యే అవ‌కాశం ఏర్ప‌డింద‌న్న‌మాట‌.