ఆ జిల్లాను స‌రిచేయ‌క‌పోతే కూట‌మి కూసాలు క‌దులిపోతాయ్‌..!

అధికార పార్టీ బ‌లాన్ని ఎలా అంచనా వేస్తార‌నేది ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం.. నాయ‌కుల ప‌నితీరు… జిల్లాల్లో ఆయా పార్టీలపై జ‌రుగుతున్న చ‌ర్చ వంటివి ప్ర‌ధానంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఇలా చూసుకునే జిల్లాల్లో ఆయా పార్టీల ప‌నితీరుపై అంచ‌నా వేసుకునే.. అధికార పార్టీల‌పై ఒక అంచ‌నాకు వ‌స్తారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా.. జిల్లాల వారీగా స‌మీక్ష‌లు.. అంచ‌నాలు పెద్ద ఎత్తున వ‌చ్చేవి. జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరును.. లెక్క‌లోకి తీసుకునేవారు.

అంతేకాదు.. ఎమ్మెల్యేలు.. మంత్రులు ప్ర‌జ‌ల‌కు ఏమేర‌కు చేరువ అవుతున్నార‌న్న లెక్క‌లు వేసుకుని వైసీపీ వ్య‌వ‌హారాల‌ను తేల్చేవారు. అయితే.. అప్ప‌ట్లో ఈ త‌ర‌హా రిజ‌ల్ట్‌ను వైసీపీ అధినేత‌, అప్ప‌టి సీఎం జ‌గ‌న్ లెక్క‌లోకి తీసుకోలేదు. ఫ‌లితంగా పార్టీ ప‌రిస్థితి ఎలా త‌యారైందో అంద‌రికీ తెలిసిందే. ఇక‌, కూట‌మి విష‌యానికి వ‌స్తే… కొన్ని జిల్లాల్లో ప‌రిస్థితి బాగానే ఉన్నా.. మెజారిటీ జిల్లాల్లో మాత్రం ప‌రిస్థితి భిన్నంగానే ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు కృష్ణాజిల్లాను తీసుకుంటే.. ఇక్క‌డి మంత్రి కొల్లు ర‌వీంద్ర నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు తేడా కొడుతోంది.

నిజానికి ఈజిల్లా ప‌రిధిలో ఇద్ద‌రు బీసీ మంత్రులు ఉన్నారు. కొల్లు ర‌వీంద్ర‌, కొలుసు పార్థ‌సార‌థి. కానీ.. వారి వ‌ల్ల‌.. జిల్లాలో రాజ‌కీయాలు బ‌లోపేతం కావ‌డం లేద‌న్న చ‌ర్చ ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. ఎవ‌రికి వారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న నివేదిక‌లు కూడా చంద్ర‌బాబుకు చేరుతున్నాయి. అవ‌నిగ‌డ్డ‌లో జన‌సేన విజ‌యం ద‌క్కించుకుంది. ఇది.. ప‌క్క‌న పెడితే.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. కృష్ణా తీరంలో ఉండ‌డంతో ఇసుక వ్య‌వ‌హారం ఎమ్మెల్యేల‌కు పంట పండిస్తోంది.

ప్ర‌జ‌ల‌కు ఏమేర‌కు చేరువ అవుతున్నార‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఇత‌ర వ్య‌వ‌హారాల్లో మాత్రం ఒక‌రినొక‌రు పోటీ ప‌డుతున్నారు. ఓ నియోజ‌క‌వ‌ర్గంలో అయితే.. మండ‌లాల‌ను.. పోలీసులు-ఎమ్మెల్యే క‌లిసి పంచుకుని.. వాటాలు వేసుకున్న వీడియోలు కూడా హ‌ల్చ‌ల్ చేశాయి. మ‌రోచోట ఏకంగా సీఎం చంద్ర‌బాబు పేరు చెప్పి.. మట్టి అక్ర‌మాలు, ఇసుక అక్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప‌రిస్థితిని మెరుగు ప‌రుచుకుని.. త‌ప్పులు స‌రిచేసుకోక‌పోతే.. జిల్లాలో పార్టీ కూసాలు క‌దిలినా ఆశ్చ‌ర్యంలేద‌న్న వాద‌న వినిపిస్తోంది.