జగన్‌కు అడ్డుకట్ట వేసే విషయంలో కూటమి ప్రభుత్వంలో సీనియర్ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. ఒకవైపు నిరసనల పేరుతో జగన్ రోడ్డు మీదకు వస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పెట్టుబడులకు సంబంధించి ఆయా కంపెనీలకు ఇక్కడ ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఈమెయిల్ రూపంలో సమాచారం పంపిస్తూ అడ్డుకుంటున్నారనేది కూటమి నాయకులు చెబుతున్న మాట. దాదాపు 200 ఈ-మెయిల్ లను పంపించి తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారనేది మంత్రి పయ్యావుల కేశవ్ గత రెండు రోజులుగా చెబుతూనే ఉన్నారు.
దీనిపై అవసరమైతే దేశద్రోహం కేసులను కూడా నమోదు చేస్తామని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఇది అంతర్గతంగా కూటమికి తగులుతున్న పెద్ద ఎదురు దెబ్బనే చెప్పాలి. బహిరంగంగా చూసుకున్నప్పుడు జగన్ చేస్తున్న పర్యటనలు, జగన్ చేస్తున్న యాత్రలు వంటివి, కూటమికి తలనొప్పిగా మారాయి. అది పొదిలి కావచ్చు, రెంటపాల కావచ్చు, ఇటీవల జరిగిన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం రైతు పరామర్శ యాత్ర కావచ్చు. ఏదైనా సర్కారుకు సవాల్ గా మారుతోంది. జన సమీకరణ, తరలివస్తున్న జనాలను చూసి వారిని కంట్రోల్ చేయలేక ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది.
దీనిపై అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ ను కట్టడి చేసేందుకు, అదేవిధంగా కార్యకర్తలు రాకుండా చూసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. మరోవైపు అంతర్గతంగా వైసిపి సానుభూతిపరులు విదేశాల్లో కూర్చుని చేస్తున్న ఈమెయిల్ ల ప్రచారం, సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా ఎలా అడ్డుకోవాలని విషయంపై సీఎం చంద్రబాబు సహా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటి కీలక నాయకులు అంతర్మథనం చెందుతున్నారని తెలుస్తోంది.
ఎలా చూసుకున్నా వైసీపీకి అడ్డుకట్ట వేయడం అనేది వచ్చే రెండు మూడు నెలల్లోనే కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారని తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీలో సీనియర్లు కూడా చెబుతున్నారు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూడాలి. ప్రస్తుతం అయితే జగన్‌కు ఆశించినంత స్థాయికి మించి జనాలు వస్తుండడం, ఎక్కడికక్కడ రహదారులు దిగ్భందం కావడం.. జనాల్లో ఆయనకు సింపతీ పెరిగిందా? అనే విషయం కూడా కూటమిని కలవర పెడుతుందనే చెప్పాలి. ఈ క్రమంలో సాధ్యమైనంత వేగంగా మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates