ఏపీలో ప్రాంతాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రాయలసీమ నుంచిఉత్తరాంధ్ర వరకు కూడా ప్రాంతాలను డెవలప్ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా అందిపుచ్చుకుని రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా మార్గాలను సుగమం చేసుకుంటోంది. తాజాగా ఏపీ స్పేస్ పాలసీపేరిట ప్రభుత్వం ఓ నివేదికను విడుదల చేసింది. కేంద్రం అమలు చేస్తున్న స్పేస్ మిషన్ ప్రాజెక్టుకు అనుబంధంగా ఏపీలో పెట్టుబడులు పెట్టించేందుకు వీలుగా చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.
దీనిలో భాగంగా ఏపీలోని రాయలసీమ జిల్లాలైన శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలలో ఏపీ స్పేస్ పాలసీ కింద పెట్టుబడులు పెట్టే వారికి పెద్దపీట వేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేందుకు, పెట్టుబడి దారులను ఆహ్వానిం చేందుకు, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఏపీ స్పేస్ కార్పొరేషన్ పేరుతో కొత్త కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్‌కు సంబంధించిన విధివిధానాలపై తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్పేస్ పాలసీని పక్కాగా అమలు చేసేందుకు వీలుగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ కార్పొరేషన్ పని ఇదీ..
- అంతరిక్ష రంగానికి చెందిన ప్రాజెక్టుల విషయంలో పెట్టుబడిదారులను ఆహ్వానించాలి.
- పెట్టుబడి దారులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలి.
- నిధులతో వచ్చే పెట్టుబడి దారులకు సకల సౌకర్యాలను ఏపీలో కల్పించేలా ఈ కార్పొరేషన్ సాయం చేయాలి.
- మౌలిక వసతుల అభివృద్ధి, స్టార్టప్ నిధులు, పెట్టుబడులను ఆకర్షించాలి.
- దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలి
- సంస్థలకు భూ కేటాయింపు, దరఖాస్తుల పరిశీలన కూడా ఈ కార్పొరేషన్ పరిదిలోనే జరగనున్నాయి.
- రాయలసీమలోని శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీలు ఏర్పాటు చేయడమే ఈ కార్పొరేషన్ లక్ష్యం.
టార్గెట్ 2030…
అంతరిక్ష రంగంలో మానవ సహిత ప్రయోగాలకు.. కేంద్ర ప్రభుత్వం 2030ని టార్గెట్‌గా పెట్టుకున్న విషయం తెలిసిందే. గగన్ యాన్ -4లో మానవులను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మౌలిక అంశాలు… ప్రాజెక్టులను ఏపీలో రూపొందించేలా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు.. ఏపీ స్పేస్ పాలసీని రూపొందించారు. ఇది దేశంలోనే తొలి సారి. ఒక రాష్ట్ర ప్రభుత్వం అంతరిక్ష రంగానికి సంబంధించి ఒక విధానం రూపొందించడం ఇదేతొలిసారి. ఈ క్రమంలో 2030 నాటికి దేశమే కాదు.. ప్రపంచం కూడా ఏపీవైపు చూసేలా చేయాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం.
Gulte Telugu Telugu Political and Movie News Updates