గోవా గవర్నర్‌గా నియమితులైన.. టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్ నుంచి తనకు ముందుగానే సమాచారం అందిందన్న ఆయన.. నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూశానని చెప్పారు. సీఎం చంద్రబాబు కృషి, ఆయన సిఫారసు తోనే తనకు ఈ అత్యున్నత పదవి దక్కిందని భావిస్తున్నట్టు చెప్పారు. మరోసారి దేశానికి సేవ చేసుకునే భాగ్యం కలిగిందని గజపతి రాజు తెలిపారు.
అవకాశం రావడం ఒక చిన్న విషయమేనన్న ఆయన.. దాని ద్వారా ఎంత మేరకు సేవ చేశామన్నది మాత్రం పెద్ద విషయమని గజపతి రాజు తెలిపారు. గోవాతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. గోవా ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన దివంగత మనోహర్ పారికర్‌తో తనకు స్నేహం ఉందన్నారు. కేంద్రంలో ఒకే సారి మంత్రులుగా తాము పనిచేశామన్నారు. ఆయనకు చేసిన సూచనల మేరకు కోరుకొండ సైనిక్ స్కూల్‌లో బాలికలకు ప్రవేశం కల్పించారని చెప్పారు.
ఓటమితో ఎవరూ నిరుత్సాహ పడనవసరం లేదని గజపతి రాజు చెప్పారు. దీని నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. గోవా అనేక సంస్కృతులకు ఆలవాలని పేర్కొన్నారు. దేశంలో అత్యుత్తమ పర్యాటక రాష్ట్రంగా కూడా ఉందన్నారు. చంద్రబాబు తనను సిఫారసు చేయడం పట్ల సంతోషంగా ఉందన్న ఆయన.. గోవా ప్రజలకు సేవ చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
చంద్రబాబు శుభాకాంక్షలు..
గోవా గవర్నర్‌గా నియమితులైన గజపతి రాజుకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌గా ఆయన నియామకం.. తెలుగు వారికి అత్యంత గర్వకారణమని పేర్కొన్నారు. విజయవంతంగా ఆయన పదవీ కాలం పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. నిజాయితీ, నిబద్ధతలకు గజపతి రాజు నిదర్శనమని పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates