‘తీన్మార్’ కొత్త పార్టీ.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న  చింత‌పండు న‌వీన్‌.. ఉర‌ఫ్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. కొత్త పార్టీని స్థాపించ‌నున్న‌ట్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని బ‌లోపేతం చేస్తామ‌ని తెలిపారు. బీసీ సామాజిక వ‌ర్గం కోస‌మే పార్టీని స్థాపించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే.. పార్టీ పేరు.. ఎప్పుడు పెట్టేది మాత్రం ఆయ‌న స‌స్పెన్సులో ఉంచారు. తాజాగా బీఆర్ ఎస్ నాయ‌కురాలు.. క‌విత‌.. బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై చేసిన వ్యాఖ్య‌లు.. ఈ క్ర‌మంలో ఆమెను కార్న‌ర్ చేస్తూ.. తీన్మార్ మ‌ల్ల‌న్న చేసిన సంచ‌ల‌న కామెంట్ల‌తో తెలంగాణ రాజ‌కీయాలు వేడెక్కాయి. తీన్మార్ మ‌ల్ల‌న్న కార్యాల‌యంపై జాగృతి కార్య‌క‌ర్త‌లు దాడి కూడా చేశారు.

ఈ ప‌రిణామాల క్ర‌మంలో మీడియా ముందుకు వ‌చ్చిన మ‌ల్ల‌న్న‌.. రాష్ట్రంలో బీసీ సామాజిక వ‌ర్గానికి అన్నాయం జ‌రుగుతోంద‌ని తెలిపారు. బీసీ సామాజిక వ‌ర్గం అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంద‌ని చెప్పారు. వారి త‌ర‌ఫున పోరాటం చేసేందుకు, రాజ్యాధికా రం ద‌క్కేలా వారిని ముందుండి న‌డిపించేందుకు త‌న‌వంతు పాత్ర పోషిస్తాన‌న్నారు. ఈ క్ర‌మంలోనే కొత్త పార్టీని స్థాపించ‌నున్న‌ట్టు మ‌ల్ల‌న్న చెప్పారు. బీసీలు ఐక్యంగా ఉంటే.. ప్ర‌స్తుతం ఉన్న రాష్ట్ర రాజ‌కీయాల‌ను మార్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. బీసీ రిజ‌ర్వేష‌న్లు ఇచ్చి.. చేతులు దులుపుకోవ‌డం కాద‌ని.. వారికి రాజ్యాధికారం ద‌క్కేలా కృషి చేయాల్సి ఉంద‌ని ప‌రోక్షంగా కాంగ్రెస్ పార్టీపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇదిలావుంటే.. గ‌త 2023 ఎన్నిక‌ల‌కు ముందు కూడా.. తీన్మార్ మ‌ల్ల‌న్న ఇలానే వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీ పెడు తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో తెలంగాణ నిర్మాణ పార్టీ(టీఎన్‌పీ)ని ఆయ‌న ప్ర‌క‌టించారు. దీనిలో యువ‌త‌కు ముఖ్యంగా బీసీ, ఎస్సీల‌కు ప్రాదాన్యం ఉంటుంద‌న్నారు. విద్యార్థుల‌ను స‌మైక్యం చేసి రాజ‌కీయాల్లోకి తీసుకురానున్న‌ట్టు తెలిపారు. 2023 రాష్ట్ర ఎన్నిక‌ల్లోనూ.. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ పోటీ చేస్తామ‌న్నారు. అయితే.. ఆ ప్ర‌తిపాద‌న అప్ప‌ట్లో కాయితాల‌కే ప‌రిమితం అయింది. యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా.. కుటుంబ రాజ‌కీయాల‌కు రాష్ట్రంలో చెక్ పెడ‌తామ‌ని కూడా అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు.

కానీ, గ‌త‌ ఏడాది జ‌రిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున మ‌ల్ల‌న్న పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత‌.. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. సీఎం రేవంత్ స‌హా.. ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు. ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకున్న‌ కుల గ‌ణ‌నను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. దీనిని రెడ్డి సామాజిక వ‌ర్గం కోస‌మే చేప‌ట్టారంటూ.. వ్యాఖ్య‌లు చేశారు. ఇది పార్టీలోనే కాదు.. ప్ర‌భుత్వంలోనూ ఆగ్ర‌హం క‌లిగించింది. దీంతో మ‌ల్ల‌న్న‌పై చ‌ర్య‌లకు ప‌ట్టుబ‌డుతూ.. సీనియ‌ర్లు పార్టీకి ఫిర్యాదు చేశారు. దీంతో అప్ప‌టి నుంచి మ‌ల్ల‌న్న‌ను పార్టీకి దూరంగా ఉంచారు.