తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు మరో షాక్ ఇచ్చింది ప్రభుత్వం. తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉన్న104 ఆలయాలకు ధర్మకర్తల మండలి ఛైర్మన్ గా తొలగిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. అశోక్ ప్లేసులో ఆయన అన్న కూతురు మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచైత గజపతిరాజును నియమించింది. గతంలో మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించిన ప్రభుత్వం సంచైతానే ఛైర్ పర్సన్ గా నియమించిన విషయం తెలిసిందే.
అంటే అప్పట్లో ట్రస్టు ఛైర్మన్ గా తొలగించిన ప్రభుత్వం తాజాగా 104 ఆలయాలకు ఛైర్మన్ గా తొలగించింది. మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా ఉన్న తననే 104 ఆలయాలకు కూడా ఛైర్ పర్సన్ గా నియమించాలని సంచైత చేసిన విజ్ఞప్తికి దేవాదాయ ధర్మాదాయశాఖ సానుకూలంగా స్పందించటంతో కొత్తగా ఉత్తర్వులు జారీచేసింది. మొత్తానికి అశోక్ కు ఉన్న చివరి పదవులను కూడా ప్రభుత్వం తొలగించేసినట్లయ్యింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలు అత్యంత వివాదాస్పదంగా ప్రచారం అవుతున్నది.
తెలుగుదేశంపార్టీ హయాంలో ఛైర్మన్ గా ఉన్న అశోక్ ట్రస్టు వ్యవహారాల్లో తనిష్టం వచ్చినట్లు వ్యవహరించినా, ట్రస్టు పాలనలో ప్రభుత్వం జోక్యం చేసుకున్నా ఎక్కడా బయటపెట్టని ఓ సెక్షన్ మీడియా ఇపుడు మాత్రం ప్రతి చిన్న విషయాన్ని నెగిటివ్ గా ఫోకస్ చేసేస్తోంది. అశోక్ హయంలో ట్రస్టులో జరిగిన అవకతవకలను, అక్రమాలను కూడా సంచైత ఖాతాలో వేసేస్తోంది సదరు మీడియా. దానికి తగ్గట్లే ట్రస్టు వ్యవహారాల్లో చంద్రబాబునాయుడు, లోకేష్ కూడా చాలా అత్యుత్సాహం చూపుతున్నారు.
ప్రతి చిన్న విషయానికి స్వయంగా చంద్రబాబే స్పందిస్తు ట్విట్టర్లో ఆరోపణలు చేయటం, మీడియా సమావేశంలో మాట్లాడుతుండటంతో ట్రస్టు వ్యవహారాలు వివాదాస్పదమవుతున్నాయి. దానికి తగ్గట్లే సంచైత గజపతి రాజు కూడా ఇటు అశోక్ అటు చంద్రబాబు ఆరోపణలకు ధీటుగా స్పందిస్తు ట్విట్టర్లో సమాధానమిస్తున్నారు. దాంతో ట్రస్టు వ్యవహారాలపై వార్తలు లేని రోజంటు ఉండటం లేదు.