వైసీపీ సెల్ఫ్ గోల్

ఆరేళ్ల ముందు 151 సీట్లతో అసాధారణ విజయం.. ఏడాది కిందట 11 సీట్లతో అనూహ్య పరాజయం.. ఈ రెండూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెల్లాయి. అంతటి విజయం తర్వాత ఇంతటి పరాభవాన్ని ఎవ్వరూ ఊహించి ఉండరు. ప్రతిపక్షంలోకి వచ్చాక దిద్దుబాటు చర్యలు చేపట్టి మళ్లీ అధికారం చేపట్టడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ వైసీపీ తీరు ఎంతమాత్రం మారడం లేదు.

అధికారంలో ఉండగా చేసిన తప్పులనే ఇప్పుడూ కొనసాగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జగన్ పర్యటనల సందర్భంగా ప్రతిసారీ తప్పటడుగులే పడుతుండడం గమనించవచ్చు. తాజాగా మరో వ్యవహారంలో వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుంది. శ్రీకాళహస్తికి చెందిన జనసేన నేత వినుత కోట దంపతులు.. తమ డ్రైవర్‌ హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

ఈ విషయం మీద సోషల్ మీడియాలో వైసీపీ రచ్చ చేయడం మొదలు పెట్టింది. జనసేన పార్టీలో క్రిమినల్స్ అంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. స్వయంగా వైసీపీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో దీని మీద ట్వీట్లు పడ్డాయి. దీని మీద చేయాల్సిన రచ్చంతా చేసి ప్రయోజనం పొందాలని వైసీపీ వాళ్లు చూస్తున్నారు. కానీ దీని వల్ల వైసీపీకి చేటే ఎక్కువగా జరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ వాళ్ల పోస్టుల కింద జనసేన, టీడీపీ వాళ్ల ఎదురుదాడి మామూలుగా లేదు. ఈ కేసు సంగతి బయటికి రాగానే వినుతను శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జిగా తొలగించారు.

కానీ వైసీపీ వ్యవహారం అలా కాదు. తన డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ అనంతబాబును పేరుకు సస్పెండ్ చేసి పార్టీ కార్యక్రమాలన్నింట్లో పాల్గొన్నా అభ్యంతర పెట్టలేదు. జగన్‌తో పలు సందర్భాల్లో ఆయన సన్నిహితంగా మెలిగారు. మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొన్న అవినాష్ రెడ్డికి జగన్ బాసటగా నిలిచారు. మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు.

ఇంకా వైసీపీలో నేర చరిత్ర ఉన్న, అభియోగాలు ఎదుర్కొన్న అనేక మందికి వైసీపీ మద్దతుగా నిలిచింది. ఎవరి మీద చర్యలు లేవు. ఈ చరిత్రనంగా జనసైనికులు, టీడీపీ వాళ్లు బయటికి తీస్తున్నారు. ఇలాంటి చరిత్ర ఉన్న వైసీపీ.. హత్య కేసు విషయం బయటికి రాగానే సస్పెండ్ చేసి పార్టీకి దూరం పెట్టిన జనసేన మీద ఎటాక్ చేయడం ఏంటి అంటూ గట్టిగా కౌంటర్ చేస్తున్నారు.