మాట‌-చేత‌.. రెండింటిలోనూ ఈ రెడ్లు టాపే.. !

రాజ‌కీయాల్లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి ప్ర‌త్యేక ప్రాధాన్యం ఉంది. వైసీపీలో అయినా.. టీడీపీలో అయినా.. రెడ్లు టాప్‌లోనే ఉంటారు. ఉన్నారు కూడా. మ‌రీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన రెడ్లు అయితే.. మాట‌, చేత రెండిట్లోనూ దూకుడుగానే ఉంటున్నారు. వైసీపీ హ‌యాం నుంచి టీడీపీ హ‌యాం వ‌ర‌కు కూడా రెడ్డి నేత‌లు.. దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తు్న్నారు. ఇంకోర‌కంగా చెప్పాలంటే.. వైసీపీ హ‌యాంలో కంటే కూడా.. టీడీపీ హ‌యాంలోనే రెడ్డి నాయ‌కులు దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం క‌నిపిస్తోంది.

నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో రెడ్డి నాయకులు టీడీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ న‌లుగురు కూడా అటు మాట‌ల్లోనూ.. ఇటు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ప‌నులకు సంబం ధించిన చేత‌ల్లోనూ దూకుడుగానే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఉదాహ‌ర‌ణ‌కు స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చం ద్రమోహ‌న్‌రెడ్డి మాట మెత్త‌గా ఉన్నా.. ప‌దునెక్కువ అనే పేరు తెచ్చుకున్నారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పైనా పార్టీపైనా ఆయ‌న దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అయితే.. సోమిరెడ్డి సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లోఉన్న నేప‌థ్యంలో ఆయ‌న దూకుడు అంద‌రికీ తెలిసిందే. ఇక‌, వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ మారి టీడీపీలోకి వ‌చ్చిన కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. వైసీపీలో ఉన్న‌ప్పుడు.. ఇప్పుడు కూడా ఆయ‌న నోటికి, చేతికీ ప‌నేమాత్రం త‌గ్గ‌లేదు. నిల‌దీయాల్సిన చోట నిల‌దీయ‌డంతోపాటు.. ప‌నులు చేయాల్సిన చోట చేయించుకుంటున్నారు. ప్ర‌జ‌ల‌కు చేరువ కూడా అవుతున్నారు.

సొంత పార్టీ ప్ర‌భుత్వ‌మే ఉన్నా.. అధికారులు స‌రిగా ప‌నిచేయ‌క‌పోతే.. మాత్రం క‌డిగి పారేస్తున్నారు. ఇక‌, పార్టీ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల్లోనూ.. పాల్గొంటూ.. ప్ర‌జ‌ల‌కు కూట‌మి మేళ్ల‌ను వివ‌రిస్తున్నారు. ఇక‌, కావ‌లి నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ఫ‌స్ట్ టైమ్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.. ఉర‌ఫ్ ద‌గ్గుమాటి వెంక‌ట కృష్ణారెడ్డి సైతం.. మాట‌ల్లో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. వైసీపీ నాయ‌కుల‌పై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. ఇటీవల మాజీ మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్‌రెడ్డి కేసుల‌పై త‌ర‌చుగా మీడియా ముందుకు వ‌చ్చారు.

ఇక‌, చేత‌ల్లోనూ దూకుడుగానేఉన్నారు. అదేవిధంగా ఆత్మ‌కూరు నుంచి విజ‌యం ద‌క్కించుకున్న మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి కూడా.. సౌమ్యంగానే ఉన్నా.. ఎక్క‌డ ఎలా స్పందించాలో అలా స్పందిస్తున్నా రు. ఆత్మ‌కూరులో ఒక‌వైపు అభివృద్ధి ప‌నులు చేస్తూనే.. మ‌రోవైపు త‌ర‌చుగా ఆయ‌న వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఇలా.. నెల్లూరు రెడ్లు.. మాట‌-చేత‌ల్లోనూ టాప్ అని అనిపించుకోవ‌డం గ‌మ‌నార్హం.