గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వారిలో చాలా మంది మహిళా నాయకులు ఉన్నారు. వీరిలో సీనియర్లు, జూనియర్లు కూడా ఉన్నారు. అయితే.. ఎంత మంది ప్రజలకు చేరువ అవుతున్నారు? ఎంత మంది సీఎం చంద్రబాబు దృష్టిలో ఉన్నారన్నది ప్రశ్న. ఇలా చూసుకుంటే.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నందిగామ నియోజవర్గం ఫస్ట్ ప్లేస్‌లో ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో తంగిరాల సౌమ్య విజయం సాధించారు. ఇటీవలే ఆమె.. లా సెట్‌లో మంచి ర్యాంకు కూడా పొందారు.
నియోజకవర్గంలో తరచుగా పర్యటించడమే కాకుండా.. చంద్రబాబు ఇచ్చే టాస్కులను పూర్తి చేయడం లోనూ తంగిరాల ముందున్నారు. తండ్రి ప్రభాకర్‌రావు మరణంతో 2015లో రాజకీయాల్లోకి వచ్చిన సౌమ్య.. అప్పటి ఉప ఎన్నికలో విజయం దక్కించుకున్నారు. 2019లో మాత్రం వైసీపీ హవాతో పరాజయం పాలైనా తర్వాత.. ప్రజల మధ్యే ఉన్నారు. ప్రజల అభిమానం చూరగొన్నారు. నిరంతరం.. నియోజకవర్గంలో పర్యటిస్తూ.. ప్రజలకు చేరువ అయ్యారు. ఈ వ్యూహమే గత ఎన్నికల్లో విజయం దక్కించేలా చేసింది.
ఇక, చంద్రబాబు దృష్టిలోనూ సౌమ్యకు మంచి మార్కులు ఉన్నాయి. రాజకీయంగా కూడా ఆమె వైసీపీపై దూకుడుగా వ్యవహరించడంతోపాటు.. రాజకీయ విమర్శలు చేయడంలోనూ.. ముందున్నారు. ఒకవైపు కూటమి నాయకులతో కలిసి నడవడంతోపాటు, మరోవైపు.. సీనియర్లతోనూ కలివిడిగా ఉంటున్నారు. వివాదాలకు, సంచలనాలకు దూరంగా ఉంటూ.. ప్రజాదర్బార్‌లు నిర్వహిస్తూ.. పార్టీలైన్ ప్రకారం వ్యవహరిస్తున్న నాయకురాలిగా సౌమ్య పేరు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఎవరినైనా తొలగించాల్సి వస్తే.. ఆ ప్లేస్‌లో తంగిరాలకు ప్రాధాన్యం ఖాయమన్న చర్చ కూడా ఉంది. సీనియర్ నాయకుల అంచనా మేరకు.. చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అర్హతలు సంపూర్ణంగా ఉన్న మహిళానాయకురాల్లో సౌమ్య ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారని చెబుతున్నారు. అయితే.. ఇది ఇప్పటికిప్పుడు జరగపోయినా.. ఈ తరహాలో ఆమె ఎలివేట్ కావడం అనేది మాత్రం రాజకీయంగా ఆమె పరిణితిని, నాయకురాలిగా.. ఆమె ప్రజలకు చేరువ అయిన విధానాన్ని మాత్రంస్పష్టం చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates