మాధ‌వ్‌ది అదే అజెండా.. తేల్చేశారుగా!

ఏపీ బీజేపీ చీఫ్‌గా కొత్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌.. పీవీఎన్ మాధ‌వ్‌.. త‌న అజెండాను చెప్ప‌క‌నే చెప్పారు. ప‌క్కా హిందూత్వ వాదిగా ఆయ‌న ముద్ర వేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ బీజేపీ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన వారిలో గ‌త రెండు ద‌శాబ్దాల కాలంలో సోము వీర్రాజు ఒక్క‌రే ఇలా హిందూత్వ అజెండాను ఫాలో అయ్యారు. అయితే.. మ‌ధ్య మ‌ధ్య ఆయ‌న కూడా ప‌ట్టువిడుపుల ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించారు. అయిన‌ప్ప‌టికీ.. సోము మాత్రం త‌న హిందూత్వ అజెండాను మాత్రం వ‌దిలిపెట్ట‌లేక పోయారు.

దీనికి ముందు.. చీఫ్‌లుగా వ్య‌వ‌హ‌రించిన‌.. కంభంపాటి హ‌రిబాబు(విశాఖ మాజీ ఎంపీ), క‌న్నా ల‌క్ష్మీనారాయణ‌(ప్ర‌స్తుతం టీడీపీ స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే)లు మాత్రం.. ఆచితూచి అడుగులు వేశారు. హిందూత్వ అజెండాను పెద్ద‌గా పైకి రాకుండా.. స‌మ‌యానికి త‌గు విధంగా రాజ‌కీయాలు న‌డిపించారు. ఇక‌, ఇటీవ‌ల వ‌ర‌కు ఏపీ చీఫ్‌గా ఉన్న ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వ‌చ్చిన నేప‌థ్యానికి తోడు.. త‌న వ్య‌క్తిగ‌త ఓటు బ్యాంకు జార‌కుండా కూడా చూసుకున్నారు.

ఈ నేప‌థ్యంలోనే హిందూత్వ అజెండాను పుణికి పుచ్చుకున్న బీజేపీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేయ‌లేక పోయార‌న్న వాద‌న వినిపించింది. ఈ క్ర‌మంలో ఆర్ఎస్ఎస్ జోక్యం, స్వ‌త‌హాగా కూడా.. ఆర్ఎస్ఎస్ నుంచి వ‌చ్చిన నేప‌థ్యంలో పీవీఎన్ మాధ‌వ్‌కు.. బీజేపీ రాష్ట్ర‌ప‌గ్గాలు అప్ప‌గించింది. దీంతో ఆయ‌న త‌న అజెండాకు ప‌దును పెంచే ప్ర‌య‌త్నం చేశారు. వ‌చ్చీ రావ‌డంతోనే బీజేపీకి బ‌ద్ధ శ‌త్రువు అయిన‌.. క‌మ్యూనిజంపై విరుచుకుప‌డ్డారు. విజ‌య‌వాడ లెనిన్ సెంట‌ర్ పేరు మార్చాల‌ని.. డిమాండ్ చేశారు.

అనంత‌రం.. ప్ర‌ఖ్యాత ప్ర‌వ‌చ‌న క‌ర్త‌.. చాగంటి కోటేశ్వ‌ర‌రావు ఇంటికి స‌తీస‌మేతంగా వెళ్లిన మాధ‌వ్‌.. ఆయన‌కు పాద‌ న‌మ‌స్కారాలు చేశారు. రాష్ట్రంలో హిందూ సామాజిక వ‌ర్గం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని దీని నుంచి వారిని కాపాడాల్సి ఉంద‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.. భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌ను స్ప‌ష్టం చేస్తోంది. ఇటీవ‌ల కాలంలో బీజేపీ చీఫ్‌లు ఇలా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం.. ఇప్పుడు వ‌చ్చీరాగానే మాధ‌వ్ హిందూత్వ అజెండాను పుణికి పుచ్చుకుని వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో.. ఆయ‌న స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చార‌న్న‌ది రాష్ట్ర నాయ‌కులు చెబుతున్న మాట‌. మ‌రి ఇది మేలు చేస్తుందా? లేదా? అనేది చూడాలి.