కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాతృసంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) స్థాపించి 99 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ ఏడాది అక్టోబరు 2 నాటికి ఆర్ఎస్ఎస్ ఏర్పడి 99 ఏళ్లు పూర్తయి.. 100వ సంవత్సరంలోకి సంస్థ అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో దేశంలో హిందూత్వకు మరింత పదును పెట్టేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దాదాపు లక్షకు పైగా సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. వీటిని గ్రామీణ ప్రాంతాల్లోనూ.. పట్టణ ప్రాంతాల్లోనూ చేపట్టనున్నారు.
అలాగే.. ఇంటింటికీ ప్రచారం చేయనున్నారు. హిందూత్వను మరింత ప్రచారం చేయడంతోపాటు.. ఇతర మతాలలోకి మారుతున్న వారికి అవగాహన కల్పించి.. హిందువులుగా వారిని కొనసాగించే ప్రక్రియకు ఈ దఫా శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 12 కోట్ల కుటుంబాలను కలుసుకుని వారికి హిందూత్వను మరింతగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేసమయంలో ఈ దఫా ఆర్ఎస్ఎస్‌లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకున్నాయి.
గతానికి భిన్నంగా..
ఆర్ఎస్ఎస్ అంటేనే హిందూత్వకు ప్రతిరూపం అనే విషయం తెలిసిందే. హిందూత్వను.. తాగు, హిందూత్వను తిను అనే నినాదంతో ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ప్రచారం చేసింది. అయితే.. కొన్నాళ్ల వరకే ఈ ఛాందస వాదం పనిచేసినా.. రాను రాను ప్రజల్లో వస్తున్న మార్పులు.. పెరుగుతున్న చైతన్యం నేపథ్యంలో ఆర్ఎస్ఎస్‌లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇతర మతాలపై ఒకప్పుడు ఉన్న తీవ్ర వ్యతిరేకత దాదాపు తగ్గిపోయింది.
అదేసమయంలో ముస్లిం మైనారిటీ వర్గంపై కూడా.. ఒకప్పుడున్న తీవ్ర స్థాయి వైషమ్యాలను ఆర్ఎస్ఎస్ తగ్గించుకుంది. ఎస్సీ, ఎస్టీలను చేరువ చేసుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసింది. ఈ నేపథ్యం లో శత వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించుకునే క్రమంలో వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేందుకు ఆర్ఎస్ఎస్ ముందుకు వచ్చింది. అంతేకాదు.. ఎస్సీ, ఎస్టీల కు మరింత చేరువ అయ్యేందుకు ప్రతిజ్ఞ చేసింది. అలాగని హిందూత్వ అనే దండలో దారాన్ని వదిలేసే ప్రయత్నం మాత్రం చేయబోమని ప్రకటించుకుంది. మొత్తానికి మరోసారి హిందూత్వ అజెండాను దశదిశగా విస్తరించాలని ఉన్నా.. కొన్ని పట్టు విడుపులతో ఆర్ఎస్ఎస్ ముందుకు సాగనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates