ఏపీలో ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించేందుకు ప్రభుత్వం రంగం రెడీ చేసింది. ఎట్టి పరిస్థితిలోనూ దీనిని అమలు చేసి తీరుతామని ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంఒకటి. అయితే.. దీనిపై అనేక అధ్యయనాలు చేసిన తర్వాత.. ప్రభుత్వం ఎట్టకేలకు దీనిని ప్రారంభించేందుకు రెడీ అయింది. దీనిపై మహిళలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణించే సదుపాయం కల్పిస్తున్నారు. అయితే.. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసులకు మాత్రమే దీనిని పరిమితం చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అయినా.. కూడా నిత్యం ప్రయాణించే మహిళలు, ఉద్యోగినులకు నెలవారీ ఖర్చు దాదాపు 1000 వరకు కలిసివస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక, ఏడాదికి 12000 వరకు వారు లబ్ధి పొందనున్నారు. అదేవిధంగా గృహిణులకు కూడా ఉచిత ఆర్టీస బస్సు ప్రయాణం మేలు చేస్తుందని లెక్కలు వేసుకున్నారు.
ఫలితంగా టీడీపీ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న క్రమంలో ఆ పార్టీకి ఈ ప్రయత్నం మంచి లబ్ధినే చేకూరు స్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీలో ఇలాంటి పథకం అమలు కాలేదు. పైగా.. జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అంటే.. కనీసంలో కనీసం 150 కిలో మీటర్ల రేడియస్‌లో ఎక్కడైనా తిరిగే అవకాశం ఏర్పడుతుంది. ఒకరకంగా ఇది మహిళా ఓటు బ్యాంకును టీడీపీకి మరింత చేరువ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదేసమయంలో అసలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇవ్వలేమని చెప్పిన వైసీపీకి మైనస్ అవుతుందని కూడా అంటున్నారు.
గత ఎన్నికల సమయంలో టీడీపీ సూపర్ 6 హామీలు ప్రకటించినప్పుడు వైసీపీ ఎద్దేవా చేసింది. మహిళా ప్రయాణికులకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తే.. ఆర్టీసీని ఎత్తేయడమే మిగిలి ఉంటుందని వైసీపీ అధినేత జగనే ప్రెస్‌మీట్లో వ్యాఖ్యానించారు. అప్పటికే తెలంగాణ, కర్ణాటకలో అమలైన ఆ పథకంపై వచ్చిన విమర్శలను ప్రభుత్వాలు పడుతున్న ఇబ్బందులను ఆయన ఉటంకించా రు. దీంతో బాబు అలివికాని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. కానీ, కూటమి సర్కారు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తోంది. దీంతో వైసీపీ మైనస్ కాగా.. కూటమికి ప్లస్ అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates