తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన యువ నాయకుల్లో కొందరు చాలా దూకుడుగా పని చేస్తున్నా రు. మరికొందరు.. మందగమనంతో ముందుకు సాగుతున్నారు. ఒకరిద్దరు మాత్రం ఇంకా తండ్రి చాటు బిడ్డల్లానే ఉండిపోతున్నారు. ఒకరిద్దరు మాత్రం తండ్రి పేరు నిలబెట్టేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కీలకంగా మారారు. సుదీర్థ కాలంగా రాజకీయాల్లో ఉన్న కేఈ కుటుంబం నుంచి వారసుడిగా ఆయన రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.
మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడిగా శ్యామ్ రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లోనే పత్తికొండ నుంచి పోటీ చేశారు. అయితే.. అప్పట్లో వైసీపీ హవా, జగన్ పాదయాత్ర ప్రభావంతో పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ.. రాజకీయంగా పుంజుకున్నారు. ప్రజల మధ్య ఉండడంతోపాటు.. తనదైన శైలితో యువతను చేరువ చేసుకున్నారు. మంత్రి నారా లోకేష్ టీంలో కూడా.. శ్యామ్‌కు ప్రత్యేక స్థానం ఉందని అంటారు. ఇక, గత ఎన్నికల్లోవిజయం దక్కించుకున్న ఆయన రాజకీయంగా తండ్రి బాటలో నడుస్తున్నారు.
ముఖ్యంగా రైతులకు అందుబాటులో ఉండడం, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా రు. అదేసమయంలో ఐటీపై మంచి పట్టున్న శ్యామ్ బాబు.. ప్రైవేటు సంస్థలను ఆహ్వానించి.. జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 200 మంది యువతకు ఉద్యోగాలు కల్పించారు. తద్వారా నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు.
ఇక, రాజకీయంగా పత్తికొండ చాలా డిఫరెంట్. వైసీపీ నాయకురాలు కంగాటి శ్రీదేవి వర్సెస్ కేఈ కుటుంబాల మధ్య దశాబ్దాలుగా రాజకీయంగా వైరం ఉంది. శ్రీదేవి భర్త హత్య అనంతరం ఈ వివాదాలు మరింత పెరిగాయి. వైసీపీ హయాంలో కేఈ కుటుంబం పై కవ్వింపు రాజకీయాలు కూడా జరిగాయి. అయితే.. కేఈ శ్యామ్ ఎమ్మెల్యే అయిన తర్వాత.. ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు చేపట్టారు. వైసీపీ నాయకురాలి వివాదాస్పద వ్యాఖ్యల పై స్పందించడమే మానేశారు. పైగా.. ఉద్రిక్తతకు అవకాశం ఇవ్వని విధంగా అందరినీ కలుపుకొని పోతూ.. రాజకీయాల్లో తనదైన శైలిని అనుసరిస్తున్నారు. దీంతో తండ్రికి తగ్గ తనయుడిగా శ్యామ్ గుర్తింపు పొందుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates