‘మ‌న ఎమ్మెల్యేను అంత మాటంటే.. మీరు ఏంచేస్తున్నారు?“

సీఎం చంద్ర‌బాబు త‌న మంత్రి వ‌ర్గ బృందంలోని 10-15 మంది మంత్రుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “మీరంతా నిద్రపోతు న్నారా?” అంటూ..వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పై వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌ పై స్పందించిన సీఎం చంద్ర‌బాబు.. ఈ విష‌యంలో మంత్రులు వ్య‌వ‌హ‌రించిన తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. “మ‌న ఎమ్మెల్యేను అంతంత మాట‌లంటే.. మీరు గ‌ట్టిగా ఖండించాల్సింది. నేను కూడా ఖండిస్తార‌నే అనుకున్నా. కానీ.. ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. అంద‌రూ నిద్రావ‌స్థ‌లో ఉన్న‌ట్టుగా అనిపించింది.” అని అన్నారు.

అంతేకాదు.. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎదురైన‌ప్పుడు.. ఖ‌చ్చితంగా ఎదురు దాడి చేయాల‌ని.. మ‌హిళ‌ల విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. లేక‌పోతే..రాంగ్ సింప్ట‌మ్స్ ప్ర‌జ‌ల్లోకి వెళ్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. టీడీపీ మ‌హిళా ఎమ్మెల్యేకే ర‌క్ష‌ణ లేద‌ని స‌మాజంలో ప్ర‌చారం జ‌రిగితే.. ఎలా? అని ప్ర‌శ్నించారు. మంత్రులు ప్ర‌తి ఒక్క‌రూ ఇలాంటి విష‌యాల్లో గ‌ట్టిగా స్పందించాల్సి ఉంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ వైసీపీకి ఛాన్స్ ఇవ్వ‌డానికి వీల్లేద‌న్నారు. అంతేకాదు.. వైసీపీ చేస్తున్న విష ప్ర‌చారం ముందు.. టీడీపీ చేస్తున్న సానుకూల ప్ర‌చారం కూడా తేలిపోతోంద‌ని చంద్ర‌బాబు చెప్పారు.

వైసీపీ చేస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారాన్ని బ‌లంగా తిప్పికొట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న చంద్ర‌బాబు.. అవ‌స‌ర‌మైతే.. మంత్రులు ఇత‌ర ప‌నులు ప‌క్క‌న పెట్టి.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు ప‌దే ప‌దే వెళ్లాల‌ని సూచించారు. వైసీపీ వ్య‌తిరేక అజెండాను ప్ర‌జ‌ల‌కు వివ‌రించి.. కూట‌మి చేస్తున్న మంచి ప‌నుల‌నువివ‌రించాల‌ని సూచించారు. “ఎవ‌రికి వారు నాపై బారం వేసి ఊరుకుంటే.. మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయి. అప్పుడు నా నిర్ణ‌యం చూసి మీరు ఇబ్బంది ప‌డొద్దు. ఇప్ప‌టికైనా.. బ‌లంగా పోరాడండి. క్షేత్ర‌స్థాయిలో వైసీపీ చేస్తున్న కుట్ర‌లను ఎండ‌గ‌ట్టండి. ఇదే మీకు మ‌రోసారి చెబుత‌న్నా.” అని చంద్ర‌బాబు తీవ్రంగానే హెచ్చ‌రించారు.