ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న కుట్రలపై విచారణకు ఆదేశించాలని నిర్ణయించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ చేస్తున్న కుట్ర లపై సీఎం చంద్రబాబు మంత్రివర్గంతో చర్చించారు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. దీనికి తాను రేయింబవళ్లు కష్టపడుతున్నానని చెప్పారు. అయితే.. ఇంత కష్టపడి కంపెనీలను ఒప్పిస్తే.. పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందన్నారు. వీటినిఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు.
“మీరు కానీ.. మీడియా కానీ.. నన్ను పైపైనే చూస్తున్నారు. నేను చాలా కష్టపడుతున్నా. రేయింబవళ్లు పనిచేస్తున్నా. ఒక్క సంస్థను ఒప్పించేందుకు తల ప్రాణం తోకకు వస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని చూసిన పెట్టుబడి దారులు రాష్ట్రానికి వచ్చేందుకు భయపడుతున్నారు. వారిని చాలా ఓర్పుగా ఒప్పిస్తున్నా. ఈ క్రమంలోనే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి. కానీ.. వీటిని ఏదో ఒక రకంగా.. చెడగొట్టి పబ్బంగడుపుకోవాలని.. వైసీపీ ప్రయత్నిస్తోంది. దీనిని సహించేది లేదు. విచారణకు ఆదేశిద్దాం. తప్పుడు ప్రచారం చేసిన వారిని జైలుకు పంపాల్సిందే” అని చంద్రబాబు సీరియస్‌గా వ్యాఖ్యానించారు.
తాజాగా గనుల శాఖకు సంబంధించి 9 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆహ్వానించారు. ఓ అంతర్జాతీయ సంస్థ పెట్టుబడు లు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అయితే.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సానుభూతిపరుడు భాస్కర్ అనే వ్యక్తి విదేశాల్లో ఉండి చంద్రబాబుకు వ్యతిరేకంగా 200 ఈ మెయిళ్లను సృష్టించి.. సదరు కంపెనీకి పంపించారని రాష్ట్ర సర్కారు గుర్తించింది. దీంతో ఆ పెట్టుబడి నిలిచిపోయింది. మరోవైపు.. పెట్టుబడులపై కూడా న్యాయ పోరాటానికి వైసీపీ నాయకులు రెడీ అయ్యారు. దీంతో పెట్టుబడులు రావడం లేదని సర్కారు భావిస్తోంది.
అదేవిధంగా రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతింటోందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై చర్చించిన చంద్రబాబు.. కూటమిపై వైసీపీ చేస్తున్న కుట్రలను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని.. ఆ 200 ఈ మెయిళ్ల వ్యవహారం వెనుక ఎవరు న్నారో.. తేల్చేందుకు విచారణకు ఆదేశించాలని నిర్ణయించారు. దీనికి గాను ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడమా.. లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు బాధ్యతలు అప్పగించడమా .. అనేది త్వరలోనే నిర్ణయిస్తామని చంద్రబాబు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates