చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించిన జగన్.. పక్కా ప్లాన్‌తో వ్యవహరించారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లాకే చెందిన వైసీపీ మాజీ సర్పంచ్ ప్రకాష్ రెడ్డికి 25 ఎకరాల మామిడి తోట ఉందని.. ఆయన గతంలోనే చాలా వరకు కాయలను కిలో 4 రూపాయల చొప్పున అమ్మేసుకున్నారని చెప్పారు. అయితే.. జగన్ వస్తున్నాడని తెలిసి.. పక్కా ప్లాన్ ప్రకారం ఐదు ట్రాక్టర్లలో మామిడికాయలను తరలించి.. నడిరోడ్డుపై పోసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారని తెలిపారు. రైతులను పరామర్శించాలన్న ఉద్దేశం ఉంటే.. రెండు మాసాల కిందటే జగన్ వచ్చి ఉండాల్సిందన్నారు.
కాని.. ఇప్పుడు కొనుగోలు ప్రక్రియ దాదాపు ముగిసిపోతున్న దశలో వచ్చి.. రాజకీయం చేయాలని.. కుట్రలు పన్నారని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్‌రెడ్డి తోట నుంచి అప్పటికప్పుడు ట్రాక్టర్లలో మామిడి కాయలు తరలించి.. రహదారికి అడ్డంగా నిలిపి.. ట్రాఫిక్ నిలిపివేసి.. ట్రాక్టర్లలోని మామిడి కాయలను రహదారులపై వెదజల్లారని చెప్పారు. పోనీ.. ఆయనకు బాధతో అలా చేశారని అనుకున్నా.. జగన్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పాలించిన అనుభవం ఏమైంది? అని అచ్చెన్న ప్రశ్నించారు. వెంటనే కారు దిగి.. ప్రకాష్‌రెడ్డిని వారించాల్సిన అవసరం లేదా? మామిడికాయలను తొక్కుకుంటూ వెళ్లిపోతారా? అని నిలదీశారు.
వాస్తవానికి జగన్ వచ్చే హెలిప్యాడ్ వద్దకు 30 మందికి అనుమతి మాత్రమే ఉందన్న అచ్చన్నాయుడు 300 మంది వచ్చారని చెప్పారు. సీఎంగా పని చేసిన వ్యక్తి ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని ఆయన నిలదీశారు. ఆ తర్వాత ర్యాలీ వద్దన్నా.. వేల మందిని పోగేసి.. ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేశారన్నారు. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారమే ర్యాలీలు చేశారని చెప్పారు. ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోతే.. ఈ రోజు మరింత మంది సింగయ్యలు చనిపోయి ఉండేవారని చెప్పారు. ఎంత జాగ్రత్తలు పాటించినా.. పోలీసులు, విలేకరులపైనా దాడులకు తెగబడ్డారని.. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకుంటామా? అని ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates