ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎంపికైన పాకాల వెంకట నాగేంద్ర మాధవ్.. తన తొలి మాటలోనే తూటా పేల్చారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా ఎంపికై వారం గడిచినా.. మంచి రోజు కోసం వెయిట్ చేసిన ఆయన తాజాగా బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బాథ్యతలు చేపట్టారు. ముందుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీజేపీ ఆఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన విజయవాడలోని ప్రముఖ షాపింగ్ సెంటర్ బీసెంట్ రోడ్డు చివరిలో ఉన్న లెనిన్ సెంటర్‌కు చేరుకున్నారు.
అక్కడి ప్రముఖ కవి.. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధవ్ బీజేపీ చీఫ్ హోదాలో తొలిసారి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఉన్న లెనిన్ సెంటర్ పేరును తక్షణమే మార్చాలని అన్నారు. అసలు మన దేశానికి లెనిన్‌కు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. భారత దేశానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి లెనిన్ పేరును ఈ సెంటర్‌కు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు.
దీనిపై కమ్యూనిస్టులు నిప్పులు చెరుగుతున్నారు. లెనిన్ సిద్ధాంతాలు.. ఆయన గురించి తెలియని వ్యక్తులే ఈ వ్యాఖ్యలు చేస్తారని విమర్శలు గుప్పించారు. మార్కిస్టు పార్టీ వ్యవస్థాపకుడైన లెనిన్ రష్యాలో చేసిన మార్పులు, సంస్కరణలను తెలుసుకోవాలని సూచించారు. ఇదిలావుంటే.. గతంలో పార్టీ చీఫ్‌గా ఉన్న సోము వీర్రా జజు కూడా.. గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్ పేరును మార్చాలని.. అక్కడ జిల్లా విగ్రహాన్ని తొలగించాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. అయితే.. అప్పట్లోనూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates