ఏపీలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కొందరు నాయకులు వారి వారసులను తెరమీదికి తీసుకువచ్చారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులు.. వయసు రీత్యా కూడా.. నాయకులు తమతమ కుటుంబసభ్యులకు టికెట్ లు ఇప్పించుకున్నారు. ఇలా టికెట్ తెచ్చుకున్నవారిలో చాలా మంది విజయం దక్కించుకున్నారు. అయితే.. వారసులకు టికెట్లు తెచ్చుకుని గెలిపించుకున్న తర్వాత.. వారసులను పక్కన పెట్టివారే రాజకీయంగా చక్రం తిప్పుతున్నారు.
అయితే.. ఇలా రాజకీయం చేయడాన్ని పార్టీ అధిష్టానం తప్పుబట్టకపోయినా.. పార్టీ నాయకులు తప్పు అని చెప్పకపోయినా.. నియోజకవర్గాల్లో వారసులు మాత్రం డైల్యూట్ అవుతున్నారు. ఉదాహరణకు.. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య విజయం సాధించారు. కానీ, ఆమె పెద్ద గా ప్రజల్లోకి రావడం లేదు. ఏం చేయాలన్నా.. ఏం కావాలన్నా.. యనమలే కనిపిస్తున్నారు. దీంతో దివ్య విషయాన్ని ప్రజలు మరిచిపోయారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి విజయం దక్కించుకున్నారు. యువ నాయకుడు భవిష్యత్తు చాలానే ఉంది. కానీ, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి అప్రకటిత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అన్నీ ఆయనే చూస్తున్నారు. వివాదాలు.. విమర్శలు.. అన్నీ జేసీ నుంచే వస్తున్నాయి. ఫలితంగా అస్మిత్ రాజకీయాలకు పెద్ద మైనస్ అయింది. ఇదే జిల్లాకు చెందిన పుట్టపర్తి నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకుడు పల్లె రఘునాథరెడ్డి కోడలు సిందూర రెడ్డి విజయం దక్కించుకున్నారు.
కానీ, ఆమె గడప దాటి బయటకు రాదు. అన్నీ రఘునాథరెడ్డే చూస్తున్నారు. దీంతో స్థానిక ప్రజనలకు సిందూరకు మధ్య కనెక్షన్ కట్ అయింది. ఇక, విజయనగరం నియోజకవర్గం నుంచి పూసపాటి అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి విజయం సాధించారు. కానీ, ప్రయోజనం లేదని స్థానికంగా నాయకులు వాపోతున్నారు. ఎందుకంటే.. అన్నీ అశోక్ చేతుల మీదుగా.. ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా వారసులను బరిలోనిలిపి విజయందక్కించుకున్నా.. రాజకీయాలను మాత్రం పెద్దలే చేస్తుండడంతో వీరికి భారీ గండిపడుతోందన్న చర్చ సాగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates