సెల్ ఫోన్ ప‌ట్టిన చంద్ర‌బాబు.. ఫ‌స్ట్ టైమ్ ఏం చేశారంటే!

ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే ఎంతసేపు అభివృద్ధి, పెట్టుబడులు.. మౌలిక సదుపాయాల కల్పన, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న‌ను మ‌లిచింది కూడా ఇలాంటి ప‌నులే. అయితే.. చేతిలో అప్పుడప్పుడు కొన్ని ఫైళ్లు మాత్రం కనిపిస్తాయి. కానీ సెల్ ఫోన్ పట్టుకొని కనిపించిన సందర్భాలు ఎప్పుడూ లేవు. పర్సనల్‌గా ఉన్నా.. పబ్లిక్ లో ఉన్నా.. చంద్ర‌బాబు ఎప్పుడూ సెల్ ఫోన్‌తో కనిపించిన పరిస్థితి లేదు.

అయితే తాజాగా తొలిసారి సీఎం చంద్రబాబు సెల్ ఫోన్‌తో కనిపించడమే కాదు, దాంతో స్వయంగా ఆయన కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా తీయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళవారం కర్నూలు జిల్లా శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నీటి మట్టాన్ని అదేవిధంగా కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా కృష్ణానదికి భారీ ఎత్తున వరద నీరు తరలివ‌స్తోంది.

దీనిని గమనించిన ఆయన కృష్ణమ్మ అందాలను తన సెల్ ఫోన్‌లో బంధించే ప్రయత్నం చేశారు. స్వయంగా హెలికాప్టర్ లో నుంచే ఆయన సెల్ ఫోన్‌లో వీడియోలు, ఫోటోలు చిత్రీకరించడం, వాటిని సేవ్ చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా సెల్ ఫోన్‌కు దూరంగా ఉండే చంద్రబాబు ఇలా వీడియోలు ఫోటోలు తీయడంతో అందరూ ఆసక్తిగా దీనికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండడం గమనార్హం.

ఒక కృష్ణ నది అందాలతో పాటు నల్లమల అటవీ ప్రాంతాన్ని కూడా చంద్ర‌బాబు ఏరియల్ సర్వేలోనే ఫోటోలు తీశారు. అలాగే వీడియోలో నల్లమ‌ల అందాలను కూడా చిత్రీకరించారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను టిడిపి నాయకులు సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.