వైసీపీ లేదు.. అయినా ప‌నులు ఆగ‌వ్‌..

ప్ర‌స్తుతం రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం కొన‌సాగుతోంది. అంటే.. కూట‌మికి చెందిన పార్టీల నాయ‌కులకు వెంట‌నే ప‌నులు జ‌రుగుతాయి. ఇది త‌ప్పుకాదు. ఎవ‌రు అధికారంలో ఉంటే వారి త‌ర‌ఫున ప‌నులు చేయిం చుకోవ‌డంఅనేది రివాజు కూడా. అస‌లు అలా చేయించుకోక‌పోతేనే పెద్ద త‌ప్పు. కానీ.. చిత్రం ఏంటంటే.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు అధికార పార్టీనాయ‌కుల కంటే కూడా.. వేగంగా ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇదే అస‌లు క‌థ‌!.

ఆశ్చ‌ర్యం అనుకుంటున్నారా? అయితే.. ఒక్క‌సారి పుంగ‌నూరు, తిరుప‌తి పార్ల‌మెంటు, బ‌ద్వేలు నియోజ‌క వ‌ర్గాల్లో ప‌ర్య‌టించండి. అక్క‌డ ఏం జ‌రుగుతోందో తెలుస్తుంది. ఇది త‌ప్పుకాదు. జ‌రుగుతున్న ప‌నుల గురించి చెప్ప‌డ‌మే ప్ర‌ధాన ఉద్దేశం. నాయ‌కుడు ఎవ‌రైనా ప్ర‌జ‌ల‌కు ప‌నులు చేయాల్సిందే క‌దా! కానీ.. గ‌తంలో వైసీపీ హ‌యాంలో మాత్రం టీడీపీ నాయ‌కులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజ‌క‌వర్గంలో ప‌నులు ముందుకు సాగ‌లేదు. అంతేకాదు.. నిధుల కోసం వారు వేచి చూడాల్సిన ప‌ని కూడా ఎదురైంది.

కానీ.. పైన చెప్పిన నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం.. ఎమ్మెల్యేలు, ఎంపీల పీఏలు ఫోన్లు చేస్తే.. ఎమ్మార్వో స్థాయి నుంచి డిప్యూటీ క‌లెక్ట‌ర్ స్థాయి వ‌ర‌కు.. అధికారులు ప‌నులు చేస్తున్నారు. ఇక‌, పోలీసులు కూడా అంతే అంటే.. ఒకింత అతిశ‌యోక్తి అనుకోవ‌చ్చు. కానీ, వాస్త‌వం. పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఫోన్ వెళ్తే.. చుట్టుప‌క్క‌ల ప‌నులు కావాల్సిందే!. ఇదీ.. పుంగ‌నూరులో వినిపించే మాట‌. దీనికి కార‌ణం.. గ‌తంలో అధికారులను బాగా చూసుకున్నారో.. లేక‌, ఇప్పుడు కూడా అధికారులు ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారో తెలియ‌దు కానీ.. అక్క‌డ ప‌నులు మాత్రం జ‌రుగుతున్నాయి.

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలోఇటీవ‌ల ఓ ఘ‌ట‌న జ‌రిగింది. ఎక్క‌డో బెంగ‌ళూరుకు చెందిన వ్యాపారులు.. ఈ నియోజక‌వ‌ర్గానికి చెందిన వైసీపీ నాయ‌కుడికి బ‌కాయి ప‌డ్డారు. ఈ విష‌యంపై ఎమ్మెల్యే ఆఫీసు నుంచి పోలీసుల‌కు ఫోన్ వెళ్లిందట‌. అంతే.. అధికారులు ఆగ‌మేఘాల‌పై స్పందించారు. బెంగ‌ళూరు నుంచి స‌ద‌రు వ్యాపారుల‌ను ఇక్క‌డకు రప్పించి సెటిల్ చేసేశారు. ఇక‌, పుంగ‌నూరులో అయితే.. ఇంకా దూకుడుగా ఉన్నార‌న్న‌ది వాస్త‌వం. ఏదేమైనా.. ఆ ఎమ్మెల్యేల మంచిత‌నం అయితే.. ఫ‌ర్వాలేదు. కానీ, భ‌య‌ప‌డి చేస్తే.. మాత్రం ప్ర‌మాదం!.