రోశ‌య్యకు చేశారు.. వైఎస్ మాటేంటి:  ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. కొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. మంగ‌ళ‌వారం త‌న తండ్రి, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 76వ జ‌యంతిని పుర‌స్కరించుకుని ష‌ర్మిల తెలంగాణ ప్ర‌భుత్వానికి కొత్త ప్ర‌తిపాద‌న చేశారు. ఇటీవ‌ల కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి కొణిజేటి రోశ‌య్య‌కు తెలంగాణ ప్ర‌భుత్వం స‌మున్న‌త గౌర‌వం ఇచ్చింద‌ని.. ఇది తెలుగు వారిగా అంద‌రికీ సంతోష‌క‌ర‌మేన‌ని చెప్పారు. రోశ‌య్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించార‌ని.. ఆయ‌న పేరుతో స్మార‌క అవార్డుల‌ను కూడా ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు.

ఈ నేప‌థ్యంలో ఏపీలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని విస్మ‌రించ‌డం స‌రికాద‌ని.. ష‌ర్మిల పేర్కొన్నారు. సుదీర్ఘ పాద‌యాత్ర చేయ‌డం ద్వారా.. 2004లో ఉమ్మ‌డి ఏపీలో రాజ‌శేఖ‌ర‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చార‌ని తెలిపారు. అనంత‌ర కాలంలో ఎన్నో పార్టీలు కూట‌మిగా వ‌చ్చినా.. కాంగ్రెస్‌ను మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకునేలా చేశార‌ని అన్నారు. ఆరోగ్య‌శ్రీ, ఇందిర‌మ్మ ఇళ్లు, ఫీజు రీయింబ‌ర్సు మెంటు వంటి కీల‌క ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టి.. కాంగ్రెస్ పాల‌న‌ను పేద‌ల‌కు చేరువ చేశార‌న్నారు.

ఈ నేప‌థ్యంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ్ఞాప‌కార్ధం.. హైద‌రాబాద్‌లో స్మృతి వ‌నాన్ని ఏర్పాటు చేయాల‌ని ష‌ర్మి ల కోరారు. హైద‌రాబాద్‌లో స్మృతి వ‌నం ఏర్పాటు చేయ‌డ‌మే ఆయ‌న‌కు నిజ‌మైన నివాళి అని పేర్కొన్నా రు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణ‌యం తీసుకోవాల‌ని అభ్య‌ర్థించారు. ఇది త‌న కోరిక మాత్ర‌మే కాద‌ని.. యావ‌త్ కాంగ్రెస్ నాయ‌కుల అభిలాష కూడా అని పేర్కొన్నారు. దీనిపై తాను ఇప్ప‌టికే పార్టీ అగ్ర‌నాయ‌కు రాలు సోనియాగాంధీకి లేఖ రాసిన‌ట్టు ష‌ర్మిల‌ తెలిపారు. త‌న డిమాండ్‌పై సీఎం రేవంత్ రెడ్డి త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆశిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.