వైసీపీ నాయకుడు, నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఇదే నియోజక వర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి(ఒకప్పుడు వదిన) రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై జన సేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఇంత పొగరా.. మహిళలను కించపరచే నోటి వదరు ఆ పార్టీని వదల్లేదు అని వ్యాఖ్యానించారు. ప్రశాంతి రెడ్డి పై నల్లపరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని సూచించారు.
మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని పేర్కొన్న ఆయన…. ఆ మాటలతో సభ్య సమాజం సిగ్గుపడుతుంద న్నారు. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని సూచించారు.
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ఆమె భర్త, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగించాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించినా, అసభ్య వ్యాఖ్యలు చేసినా చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడూ ఆ పార్టీ నాయకులు నోటి వదరుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు. నిండు శాసనసభలో కూడా అదే విధంగా మాట్లాడటంతో… ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారు. అయినప్పటికీ వదరుబోతు మాటలు వదల్లేకపోతున్నారు. పొగరుతో వ్యవహరిస్తున్నారు. మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుంది. అని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates