వైసీపీ బ్రాండు మారదు.. ఇదే రుజువు

2019లో ఏకంగా 151 అసెంబ్లీ సీట్లతో ఏపీలో అధికారం దక్కించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్.. ఐదేళ్లు తిరిగేసరికి మరీ దారుణంగా 11 సీట్లకు పరిమితం అవడం పెద్ద షాక్. ఆ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ… ప్రధానంగా వైసీపీ నేతల అహంకార ధోరణి, చవకబారు భాష జనాలకు అసహ్యం పుట్టించి ఆ పార్టీ పుట్టి ముంచాయన్నది స్పష్టం. అవతలి పార్టీ నేతల మీద ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడం, బూతులు తిట్టడం, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం.. మంత్రుల దగ్గర్నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు అందరిదీ ఇదే వరస.

దీంతో జనాలకు చిర్రెత్తుకొచ్చి ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పారు. ఐతే ఈ ఓటమి నుంచి వైసీపీ నేతలు కాస్తయినా పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా వైసీపీ నేతలు నోటి దురుసు తగ్గడం లేదు. ఇందుకు తాజా రుజువు నెల్లూరు జిల్లా ప్రముఖ నేతల్లో ఒకరైన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యవహారమే.

కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తనను చిత్తుగా ఓడించి ఎమ్మెల్యే అయిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీద మరోసారి ప్రసన్న కుమార్ రెడ్డి నోటి దురుసు చూపించారు. దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ప్రశాంతి రెడ్డి.. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి రెండో భార్య అన్న సంగతి తెలిసిందే. ప్రసన్న కుమార్ రెడ్డి బంధువైన సోమిరెడ్డి సోదరుడిని ప్రశాంతి తొలి వివాహం చేసుకున్నారు. కానీ భర్త చనిపోవడంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో వేమిరెడ్డిని పెళ్లాడారు.

ఐతే ప్రసన్నకుమార్ రెడ్డి వీలు చిక్కినపుడల్లా ప్రశాంతిరెడ్డిని పెళ్లి విషయంలో టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఐతే తాను ఏ పరిస్థితుల్లో రెండో వివాహం చేసుకున్నానో ప్రశాంతి రెడ్డి వివరణ ఇచ్చారు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం ఈ విషయంలో మళ్లీ మళ్లీ ప్రశాంతిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. వేమిరెడ్డి మంచి వ్యక్తి అని, ఆయన కావాలంటే మంచి కుటుంబంలో ముక్కుపచ్చలారని అమ్మాయిని ఇచ్చి చేసి ఉండేవాళ్లమని.. కానీ ఆయన వెళ్లి బోరుబావిలో పడిపోయాడని ఇటీవలే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. 

అంతే కాకుండా ప్రశాంతిరెడ్డి చాలా చోట్ల పీహెచ్‌డీలు చేశారని.. ఆమె చరిత్ర చాలా రాష్ట్రాల్లో తెలుసని ద్వంద్వార్థాలతో మాట్లాడారు. డబ్బు కోసం వేమిరెడ్డిని బ్లాక్‌మెయిల్ చేసి పెళ్లి చేసుకుందని విమర్శలు చేశారు. నిన్న వైసీపీకి సంబంధించిన ఓ సమావేశంలో ఈ వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో రాత్రి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద పెద్ద దాడి జరిగింది. ఇది ప్రశాంతి అభిమానులే చేశారని అంటున్నారు.

కానీ ప్రశాంతి మాత్రం ఈ దాడితో తనకు సంబంధం లేదని.. ప్రసన్న వ్యాఖ్యలతో బాధ పడ్డవాళ్లు ఎవరైనా దాడి చేసి ఉండొచ్చని చెప్పారు. ఇదిలా ఉంటే.. తన వ్యాఖ్యల మీద తీవ్ర దుమారం రేగడంతో ప్రసన్నకుమార్ మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. తాను నోరు జారానని ఒప్పుకుని, సారీ చెబుతారేమో అనుకుంటే.. నిన్నటి తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని చెప్పడం గమనార్హం. ఇది చూశాక వైసీపీ బ్రాండు మారదని.. బూతులు, వ్యక్తిగత వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు విడిచిపెట్టలేరని.. ఇలా ఉన్నంత కాలం జనాల్లో వారి మీద సానుకూల అభిప్రాయం రావడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.