‘సుపరిపాలనలో తొలి అడుగు-ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో కూటమి ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వామ్య పార్టీ టీడీపీ ప్రజల మధ్యకు వెళ్తోంది. ఈ నెల 2 నుంచి నాయకులు, మంత్రులు ప్రజలను కలుస్తున్నారు. ప్రత్యేక బుక్‌లెట్లు పట్టుకుని ఏడాది కాలంలో ఏం చేశారో ప్రజలకు వివరిస్తున్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ.. కార్యక్రమంలో దాదాపు అందరూ పాల్గొంటున్నారు. దీనిపై ప్రజల నుంచి కూడా మంచి స్పందనే లభిస్తోంది.
ముఖ్యంగా మార్పు కనిపిస్తోందన్న టాక్ ఎక్కువగా వినిపిస్తుండడం గమనార్హం. గతంలో వైసీపీ హయాంలో కంటే ఇప్పుడు మార్పు కనిపిస్తోందని ఎక్కువగా చెప్పడం విశేషం. సహజంగా నగరాలు, పట్టణాల్లో ఈ మాట ఎక్కువగా వినిపించడం కొత్తకాదు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లోనూ మార్పు కనిపిస్తోందని ప్రజలు చెబుతున్నారు. దీనికి ప్రధానంగా 3 కారణాలు చెబుతున్నారు. వాటిని ఆధారం చేసుకుని మార్పు కనిపిస్తోందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.
1) రహదారుల నిర్మాణం: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను నిర్మిస్తుండడాన్ని మెజారిటీ ప్రజలు స్వాగతిస్తున్నా రు. ఒకప్పుడు 20 మైళ్ల దూరంలో ఉన్న గ్రామాలకు కూడా.. రహదారులు లేకుండా పోయాయి. వాటిని ఇప్పుడు నిర్మిస్తున్నారు.అలాగే.. చిన్న చితకా రహదారులనుకూడా వేస్తున్నారు. ఒకప్పుడు ఖర్చుల పేరుతో ప్రభుత్వాలు వాటికి దూరంగా ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రోడ్లు వేస్తున్నారు.
2) ఉపాది హామీ పథకం కింద నిధులు వెచ్చించి.. పనులు చేయిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు తగ్గాయి. కొన్ని చోట్ల ఇంకా వలసలు ఉన్నా.. మరిన్ని చోట్ల మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఇది కూడా.. తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలో ప్రజలు చెబుతున్నారు. 3) ఇంటికే అందుతున్న పథకాలు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం మంచి మార్కులు వేసేలా చేసింది. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ నిధులు అందడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. మార్పు కనిపిస్తోందని మెజారిటీ ప్రజలు అభిప్రాయ పడుతుండడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates