వైసిపి హయాంలోనూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ రాష్ట్ర హైకోర్టు చేస్తున్న వ్యాఖ్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు చర్చకు దారితీస్తున్నాయి. వైసిపి హయాంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులపై అప్పట్లో వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేశారు అన్నది అందరికీ తెలిసిందే. ఏకంగా న్యాయమూర్తులను… న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను కూడా తప్పుపడుతూ కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ విషయం దుమారానికి దారి తీసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా అప్పట్లో హైకోర్టు తప్పు పట్టింది. కొన్ని రద్దు కూడా చేసింది.
అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వ్యవహారంలో మార్పు వస్తుందని చాలామంది అనుకున్నారు. న్యాయవ్యవస్థ పట్ల అలాగే తీర్పుల పట్ల కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. కానీ ఎక్కడో తేడా కొడుతోంది. లేకపోతే అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు కూటమి ప్రభుత్వంపై కూడా విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి. నాడు వైసిపి హయాంలో ఏ విధంగా అయితే జరిగిందో.. అంత తీవ్రత ఇప్పుడు లేదని చెబుతున్న.. మొత్తానికి హైకోర్టు దృష్టిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఒక సానుకూలత అయితే తప్పుతోంది.
ఇది ముందు ముందు ప్రభుత్వానికి ఇబ్బందికర అంశంగా మారే అవకాశం ఉంటుందనేది న్యాయం నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తిరుపతి లడ్డుకు సంబంధించిన కేసులో నిందితులకు బెయిలు ఇవ్వడం, అలాగే సింగయ్య మృతి కేసులో వైసిపి నాయకులపై జరుగుతున్న విచారణపై స్టే ఇవ్వటం వంటి పరిణామాలను కొందరు విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. దీనిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది సరికాదు అన్నది ఇటు కూటమిలో ఉన్నటువంటి సీనియర్లు కూడా చెబుతున్న మాట. ఇక మరో ముఖ్య విషయం సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారన్న కారణంగా కేసులు పెట్టడాన్ని హైకోర్టు తాజాగా తప్పు పట్టింది.
వైసిపి హయాంలో సోషల్ మీడియాను బంధీని చేశారని, సోషల్ మీడియాలో స్వేచ్ఛ లేకుండా పోయిందని టిడిపి నాయకులు చాలామంది వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్న వారి పట్ల కేసులు పెట్టడం జైలుకు పంపించడం వంటివి హైకోర్టు దృష్టికి వెళ్లాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెజిస్ట్రేట్లను హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఇలాంటి కేసుల్లో రిమాండ్లు విధించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ పరిణామాలను గమనిస్తే వైసిపి అయినా కూటమి అయినా హైకోర్టుల విషయంలో న్యాయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. లేకపోతే భవిష్యత్తులో ప్రమాదకరమైన అంశాలను నెత్తినెత్తికోవలసిన పరిస్థితి, బాధ్యత వహించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates