సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ డీవై చంద్రచూడ్ అకస్మాత్తుగా వార్తల్లోకి ఎక్కారు. సుదీర్ఘకాలంగా న్యాయ వ్య వస్థలో ఉన్న చంద్రచూడ్ కుటుంబం ఎప్పుడూ.. ఇలా వార్తల్లోకి ఎక్కలేదు. పైగా.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి విషయంలో ఇలా.. ఎప్పుడూ కూడా వార్తలు రాలేదు. విమర్శలు కూడా రాలేదు. కానీ, హిస్టరీలో ఫస్ట్ టైమ్ అన్నట్టుగా.. జస్టిస్ చంద్రచూడ్ వ్యవహారం తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలోను.. న్యాయ వర్గాల్లోనూ దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. జాతీయస్థాయిలో ఒక్కసారిగా ఇది చర్చనీయాంశం కూడా అయింది.
ఏం జరిగింది?
“తక్షణమే మాజీ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను ఇంటి నుంచి ఖాళీ చేయించండి” అని పేర్కొంటూ.. సుప్రీంకోర్టు నుంచి కేంద్రానికి సుదీర్ఘ లేఖ అందింది. దీనిని కేంద్రం ఆదివారం రివీల్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆయన చుట్టూ ఏం జరిగిందన్న చర్చ ప్రారంభమైంది. దేశ ప్రధాన న్యాయమూర్తిగా 24 నెలలకు పైగా చంద్రచూడ్ సేవలు అందించారు. అనేక కీలక తీర్పులు కూడా ఇచ్చారు. ఈయనకు సీజేఐగా ఉన్న సమయంలో ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లో అధికారిక నివాసాన్ని కేటాయించారు. ఆయన ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. అయితే.. తమకు ఈ భవనం అవసరం ఉందని.. తక్షణమే ఆయనను ఖాళీ చేయించాలని కోరుతూ.. సుప్రీంకోర్టు కేంద్రానికి నాలుగు పేజీల లేఖ రాసింది.
ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో ఏ ప్రధాన న్యాయమూర్తి విషయంలోనూ సుప్రీంకోర్టు ఇంతగా స్పందించలేదని న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఇక, చంద్రచూడ్ విషయానికి వస్తే.. ఆయన గత ఏడాది నవంబరులో పదవీ విరమణ పొందారు. అయినా… వ్యక్తిగత అవసరాల నేపథ్యంలో అధికారిక బంగళాలోనే ఉంటున్నారు. దీనిపై ఇప్పటికే ఆయన రెండు సార్లు సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. తన పిల్లల చదువులు, వ్యక్తిగత అవసరాల నేపథ్యంలో అక్కడ ఉంటున్నానని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు.. తాను పదవీ విరమణ పొందిన తర్వాత.. కేటాయించిన బంగ్లాలో పనులు జరుగుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ.. సుప్రీంకోర్టు.. ఇలా లేఖ రాయడంపై న్యాయనిపుణులు.. దేశవ్యాప్తంగా న్యాయవాద వర్గాలు కూడా.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు కేంద్రానికి కూడా ఆయన మరోసారి తన సమస్యలు చెప్పుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా.. ఈ పరిణామం దేశ చరిత్రలో తొలిసారి అంటున్నారు. వాస్తవానికి న్యాయనిపుణుల విషయంలోనూ.. ప్రధాన న్యాయమూర్తుల విసయంలోనూ కొంత వెసులుబాటు ఉంటుందని.. కానీ, ఇప్పుడు ఏదో జరిగి ఉంటుందన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates